
మండల పరిషత్ పునర్వ్యవస్థీకరణ
నారాయణఖేడ్: స్థానిక సమరానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మండల ప్రజాపరిషత్తుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టారు. మండల ప్రాదేశిక స్థానాలు (ఎంపీటీసీ)ల ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఇదివరకే ఆదేశించారు. మండల ప్రజాపరిషత్తుల పునర్వ్యవస్థీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీలు..
ప్రతీ మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ(మండల ప్రాదేశిక) స్థానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటైనా చాలా ఎంపీటీసీలు పాత మండలాల పరిధిల్లోనే ఉన్నాయి. ఎంపీటీసీలు కూడా పాత మండలాల వారీగానే ఉన్నారు. జిల్లాలో పలు కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు పట్టణ కేంద్రాల సమీపంలోని ఆయా గ్రామాలు మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో మండలాల్లోని ఎంపీటీసీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పూనుకుంది. మండలాన్ని ప్రాతిపదికన తీసుకుని ఎంపీటీసీల సంఖ్యను కొత్తగా నిర్ణయించనుంది.
రెండు తగ్గి.. రెండు జత కూడి..
జిల్లాలో 28 మండలాలుగా 26 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇటీవల అమీన్‌పూర్, జిన్నారం మండలాలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. దీంతో ఈ జిల్లా ప్రాదేశిక స్థానాలు తొలగిపోయాయి. ఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్, ఆందోల్ నియోజకవర్గంలో చౌట్‌కూర్‌లు కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఎన్నికల్లో నిజాంపేట్, చౌట్‌కూర్‌లలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొలువు దీరనున్నారు. గత ఐదేళ్ల క్రితం జిల్లాలో ఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద, సిర్గాపూర్, ఆందోల్‌లో వట్‌పల్లి, జహీరాబాద్‌లో మొగుడంపల్లిలు కొత్త మండలాలుగా ఏర్పాటయి వాటిల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికయ్యారు. ఈసారికూడా జిల్లా లో 26 ఎంపీపీలు, 26జెడ్పీటీసీ స్థానాలు ఉండనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 271 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వీటి సంఖ్య పునర్వ్యవస్థీకరణలో పెరిగేందుకు ఆస్కారం ఉంది.
ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లలో తలమునకలు
త్వరలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్
కొత్త మండలాల్లోనూ కొలువుదీరనున్న పాలకవర్గాలు