
కారెక్కిన కాంగ్రెస్ నాయకులు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు యూటర్న్ తీసుకున్నారు. సోమవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పట్టణానికి చెందిన జీవన్‌రావు, చిన్నశంకరంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మితో పాటు మరికొంతమంది తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారే కావడం గమనార్హం. పలు కారణాలతో ఉద్యమ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇదిలాఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన చాలా మంది నేతలు పార్టీని వీడారు. ప్రస్తుతం వారంతా మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.