
నిరవధిక సమ్మెకు సిద్ధం
జహీరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి సమ్మెకు పోతున్నట్లు టీవీఏసీ–జేఏసీ ప్రకటించింది. సమ్మెకు శాశ్వత ఉద్యోగులు సైతం సహకరించాలని కోరింది. విద్యుత్ ఉత్పత్తి నుంచి బిల్లుల వసూళ్ల వరకు అంతా ఆర్టిజన్లే చేస్తున్నా.. తమ డిమాండ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జహీరాబాద్, పటాన్‌చెరు, జోగిపేట, సంగారెడ్డి డివిజన్లు ఉండగా 568 మంది ఆర్టిజన్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బోర్డులో ఉన్న నిబంధనలనే అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారని, అయినా అమలు చేయక పోవడం వల్లే సమ్మె బాట పట్టాల్సి వస్తోందంటున్నారు. విధి నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నా.. పట్టించుకోవడం లేదని, ఆర్థిక ఇబ్బందులతో పలువురు ఆత్మహత్యలకు సైతం పాల్పడినా న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. బోర్డు విభజన సందర్భంగా ఇస్తామని చెప్పిన వాటినే తాము అడుగుతున్నామని పేర్కొంటున్నారు. ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ను అమలు చేయాలని, ఆర్టిజన్లు మరణిస్తే వారి సంతానానికి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే సంస్థ అన్నప్పుడే ఒకే రూల్ ఉండాలని, ప్రస్తుతం పర్మినెంట్ వారికి ఒక విధానం, ఆర్టిజన్లకు ఒక చట్టం అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సీనియారిటీని బట్టి బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, ఇండస్ట్రీయల్ యాక్టు ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులను పర్మనెంట్ చేయడం ద్వారానే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం లభిస్తుందంటున్నారు. నిరవధిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆర్టిజన్లు జిల్లా వ్యాప్తంగా ఆవిష్కరిస్తున్నారు. గోడలపై వాటిని అంటించి మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు.
పర్మినెంట్ కోసమే ఆందోళన
తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు వెళుతున్నాం. కరెంటు ఉత్పత్తి మొదలుకొని బిల్లుల వసూళ్ల వరకు అన్నీ ఆర్టిజన్ కార్మికులే చేస్తున్నా న్యాయం జరగడం లేదు. వివక్షతకు గురవుతున్నాం. పర్మినెంట్ చేయడం ద్వారానే ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం ఉంటుంది. బోర్డు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నాం. ఉద్యమానికి శాశ్వత ఉద్యోగులు కూడా సహకరించాలి.
– ఆయిదాల జైపాల్, తెలంగాణ విద్యుత్
వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు
విద్యుత్ సంస్థలో వెట్టి చాకిరి చేయడానికే తాము పుట్టినట్లు ఉందని ఆర్టీజన్ కార్మికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం సామగ్రి, బ్లేడ్స్ ఓపెన్ కాని ఎల్‌బీ స్విచ్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు కాళ్లు, చేతులు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు కరెంటు స్తంభాలపైనే ప్రాణాలు వదులుతున్నారని, పిల్లలు అనాథలు అవుతున్నారని వాపోతున్నారు. ఇంత కష్టపడి పని చేస్తున్నా సంస్థలో తగిన గుర్తింపు లే కుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
14 నుంచి ఆర్టిజన్ కార్మికుల ఆందోళన బాట
ఆర్టీజన్స్ కన్వర్షన్‌తోనే
ఉద్యోగ భద్రత, ఆత్మగౌరం
జిల్లా వ్యాప్తంగా పోస్టర్ల ఆవిష్కరణ

నిరవధిక సమ్మెకు సిద్ధం