
ఒంటరి మహిళలే టార్గెట్
మెదక్ మున్సిపాలిటీ: బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన దొంగతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బదనపురం పెంటయ్య అలియాస్ ప్రేమ్, తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన కుమ్మరి శివకుమార్, ఇదే మండలం వట్టూరుకు చెందిన పాంబండ వరలక్ష్మిలతో కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. కల్లు దుకాణాల్లోకి ఒంటరిగా వచ్చే మహిళలను టార్గెట్ చేసుకున్నారు. వారికి మాయ మాటలు చెప్పి బాగా కల్లు తాగిస్తారు. మత్తులోకి జారుకోగానే వాళ్ల దగ్గర ఉన్న బంగారం నగలు, వెండి కాళ్ల కడియాలను దోచుకొని వెళ్లేవారు.ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లికి చెందిన ఎరుకల ఎల్లవ్వ మెదక్ పట్టణంలోని ఒకటవ నంబర్ కల్లు దుకాణంలోకి వచ్చింది. ఆమె వద్ద ఉన్న బంగారం నగలు, కాళ్ల కడియాలపై వీరి దృష్టి పడింది. ఆమెకు బాగా కల్లు తాగించి మత్తులోకి జారుకోగానే తులం బంగారు గుండ్లు, 1.5 తులాల బంగారు కమ్మలు, 60 తులాల వెండి కడియాలను దోచుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా కుమ్మరి శివకుమార్ అదుపులోకి విచారించగా.. ఈ కేసులో వరలక్ష్మి, పెంటయ్యల ప్రమేయం ఉన్నట్లు తేలింది. నిందితులపై నర్సాపూర్, గజ్వేల్, మనోహరబాద్‌లలో కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును ఛేదించిన మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్, పోలీసు బృందం అమర్, నర్సింలు, నిఖిల్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్ వ్యసనంతో చోరీలు
ముగ్గురు దొంగల రిమాండ్
రూ.6లక్షల విలువైన సొత్తు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన
ఎస్పీ శ్రీనివాసరావు