
రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
పటాన్‌చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. సోమవారం పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి కవ్వింపు చర్యగా పని గంటలు పెంచుతూ జీవో జారీ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యతో శ్రమ దోపిడీకి చట్టబద్దత కల్పించినట్లేనని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు