
బరువెంత..? ఎత్తెంత..?
చిన్నారులపై ప్రత్యేక దృష్టి
● అంగన్‌వాడీల్లో స్పెషల్ డ్రైవ్
● సంపూర్ణ ఆరోగ్యం దిశగా కృషి
● ఒక్కో ప్రాజెక్టులో ఏక కాలంలో
జిల్లాలోని సూపర్‌వైజర్లందరూ తనిఖీలు
నారాయణఖేడ్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేది పేద పిల్లలు కావడంతో వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ పోషకాహార లోపాలను అధిగమించేలా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలో ఈ నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా అంగన్‌వాడీల బలోపేతం, పిల్లల ఆరోగ్యం పట్ల సంపూర్ణ శ్రద్ధ కనబరుస్తుండడంతో జిల్లా అధికారులు ఒక అడుగు ముందుకు వేసి.. జిల్లా మొత్తం స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల అంగన్‌వాడీల పనితీరుపై ఆ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. పలు అంశాలపై కీలక సూచనలు చేశారు. చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగు పర్చడం, అవసరమైతే స్వయం సహాయక సంఘాలు, స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవడం గురించి సూచనలు చేశారు. పోషకాహార లోపం చిన్నారుల్లో తగ్గించి ప్రోగ్రెస్ రిపోర్ట్ విధానం అమలు చేయాలని సూచించారు.
3,250 మంది చిన్నారుల్లో పోషకాహార లోపం
జిల్లాలో నారాయణఖేడ్, జోగిపేట, సదాశిపేట్, జహీరాబాద్, పటాన్‌చెరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 0– 6 ఏళ్లలోపు చిన్నారులు 1,02,755 మంది ఉన్నారు. వీరిలో ఎస్‌ఏఎం (తీవ్ర పోషకాహారలోపం ఉన్న పిల్లలు) 627మంది ఉండగా ఎంఏఎం (తక్కువ పోషకాహారలోపం పిల్లలు) 2,623 మంది ఉన్నారు. అందరు చిన్నారులకు పోషణలోపం సమస్యలు దూరం చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతీనెల నమోదు
ప్రతీనెల అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తులను అంగన్‌వాడీ టీచర్లు నమోదు చేస్తారు. ఈ వివరాలను ఎన్‌హెహెచ్‌టీఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. దీని ఆధారంగా పిల్లల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని అధికారులు చర్యలు తీసుకుంటారు. తక్కువ తీవ్ర లోప పోషణ, తీవ్ర లోప పోషణ ఉన్న చిన్నారులకు గుర్తించి వారికి బాలామృతం ఫ్లస్ అందివ్వడం, ఒక గుడ్డుకు బదులు రెండు గుడ్లు అందిస్తారు. మరీ అనారోగ్య సమస్యగా ఉంటే చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అంగన్‌వాడీ టీచర్ సమీప పీహెచ్‌సీలో చికిత్సలు చేయిస్తారు.
అంగన్‌వాడీల తనిఖీలు
కాగా కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తు తీయడం, వివరాల నమోదు సక్రమంగా జరుగుతుందా లేదా అనే అంశాలపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ లలితకుమారి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పరిధిలోని సూపర్‌వైజర్లందరూ సుమారు 50మంది వరకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడు రోజులపాటు అన్ని కేంద్రాలను తనిఖీ చేస్తారు. కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులు సూచించిన వివరాలన్నింటిని నమోదు సక్రమంగా చేశారా లేదా పరిశీలిస్తారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్ది సూచనలు, సలహాలు అందజేస్తారు. ఒక్కో ప్రాజెక్టులో మూడు, నాలుగు రోజుల చొప్పున జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని వందశాతం అంగన్‌వాడీ కేంద్రాలను నెలాఖరు వరకు తనిఖీలు
చేపట్టనున్నారు.
కేంద్రాలు తనిఖీ
ఖేడ్ నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల సూపర్‌వైజర్లు తనిఖీలను ప్రారంభించారు. కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువు పరిశీలిస్తున్నారు. తాము కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షిస్తున్నాం.
– సుజాత, సీడీపీవో, ఐసీడీఎస్ ప్రాజెక్టు నారాయణఖేడ్
నెలాఖరు వరకు తనిఖీలు
ఈ నెలాఖరు వరకు జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్లు క్రాస్ చెక్ చేస్తారు. పిల్లల బరువు, ఎత్తు నమోదు సక్రమంగా చేస్తున్నారా లేదా పరిశీలించి తగు సూచనలు సలహాలు అందజేస్తారు. ప్రత్యక్షంగా బరువు, ఎత్తు కొలిచి పరిశీలిస్తారు. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం.
– లలితకుమారి,
ప్రాజెక్టు డైరెక్టర్,
సీ్త్ర, శిశు సంక్షేమశాఖ
సంగారెడ్డి
తక్కువ బరువుతో నష్టం
చిన్నారుల్లో వయస్సుకు తగ్గ బరువు, ఎదుగుదల తగ్గుదలతో తీవ్ర నష్టాలు వస్తాయి. పిల్లలకు పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం చేసుకొనే సామర్థ్యం దెబ్బతినడం వారి పెరుగుదలను దెబ్బతీస్తూ తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గి త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతారు. మెదడు అభివృద్ధి, జ్ఞానాత్మక నైపుణ్యాలపై ప్రభావం పడుతోంది. ఇది అభ్యసన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బరువెంత..? ఎత్తెంత..?

బరువెంత..? ఎత్తెంత..?

బరువెంత..? ఎత్తెంత..?