
ఈ పాపం ఎవరిది..?
పటాన్‌చెరు: సిగాచి పరిశ్రమలో అసలు ప్రమాదం ఎలా జరిగింది.. దానికి కారణాలేమిటి..? ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ సంగతేమిటి..?డ ఇలా పారిశ్రామికవాడలోని కార్మికులు, సంఘాల నేతలు ప్రమాదంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. పరిశ్రమలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ప్రమాదం జరిగిందని వారు భావిస్తున్నారు. ప్రధానంగా ఆ పరిశ్రమను స్థాపించిన నాటి పరిస్థితులే నేటికీ ఆ పరిశ్రమలో ఉన్నాయని నవీన సాంకేతిక పరిజ్ఙానాన్ని అనుసరించి పరిశ్రమను అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. బాయిలర్‌కు అనుసంధానమైన డ్రైయ్యర్‌కు నిబంధనల ప్రకారం ఉండాల్సిన దూరం లేదని చెబుతున్నారు. ఇంట్లో గ్యాస్ కుక్కర్‌కు ఉండే సేఫ్టీ నట్ లాంటి వ్యవస్థ డ్రైయ్యర్‌కు లేకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మొత్తం అయిదు చోట్ల ఎగ్జాస్ట్ హోల్స్ (ఆవిరి బయటకు వెళ్లే మార్గాలు) ఉండాలని, అలాంటి వ్యవస్థ లేని కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది వరకే ఓ కార్మికుడి కుటుంబీకుడు తన తండ్రి చెప్పినట్లు పాత సామగ్రి కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కనీసం ఫైర్ ఇంజన్ పరిశ్రమ చుట్టూరా తిరిగే విధంగా సెట్ బ్యాక్‌లు కూడా లేవు. అగ్నిమాపక శాఖ, విద్యుత్ అధికారులు, టీఎస్‌ఐఐసీ అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. పరిశ్రమలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రహరీగోడపై అమర్చి ఉండటాన్ని తప్పు పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది ఉండే సెక్షన్‌ను డ్రయ్యర్ ఉన్న చోట పై అంతస్తులో ఉండటాన్ని కూడ తప్పు పడుతున్నారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలో ఉత్పత్తి చేస్తున్న పరిమాణానికి తగిన విధంగా ఏర్పాట్లు లేవని ఎప్పుడో 1989లో స్థాపించిన పద్దతిలోనే పరిశ్రమ ఇప్పటికీ పెద్ద మార్పులు లేకుండా కొనసాగుతుందని వివరించారు. అన్ని శాఖల వారి నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇతర యూనియన్ నేతలు మాట్లాడుతూ నిపుణులైన కార్మికులను కాకుండా అన్‌స్కిల్డ్ వర్కర్లను పని చేయించడం కారణంగా కూడా ప్రమాదానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేందుకు హైలెవల్ కమిటీ, నిపుణుల కమిటీలు అధ్యయనం ఓ వైపు కొనసాగుతుండగా పారిశ్రామికవాడలో ప్రమాదానికి కారణాలపై చర్చించుకోవడం గమనార్హం.
‘సిగాచీ’ప్రమాదానికి కారణాలెన్నో..
అన్ని శాఖల నిర్లక్ష్యం కూడా..
నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని
అందిపుచ్చుకోలేదు
పారిశ్రామికవాడలో
కార్మికుల చర్చోపచర్చలు