
రమణీయం.. రథోత్సవం
జిన్నారం(పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పూరి జగన్నాథుని రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శుక్రవారం రథోత్సవ వేడుకలకు పట్టణ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాజీ జెడ్పీటీసీ బాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు హనుమంత్ రెడ్డి, బీరప్ప యాదవ్, గోపాలమ్మ, రమణయ్య, నాయకులు వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
హెచ్‌ఎండీఏ ప్లాట్లు ఇవ్వాలి
కంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కందిలోని సర్వే నంబర్ 656లో హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం తీసుకున్న భూముల యజమానులకు ప్లాట్లను ఇవ్వాలని బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం తమ నుంచి భూములు తీసుకుందని తెలిపారు. ఎకరాకు 600 గజాల ప్లాటును ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న అధికారులు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. కాలయాపన చేయకుండా వెంటనే ప్లాట్లను భూములు కోల్పోయిన వారికి చేయాలని కోరారు.
ఈపీఎఫ్‌పై కార్మికులకు అవగాహన
జిన్నారం(పటాన్‌చెరు): కార్మికుల జీవితాలకు ఈపీఎఫ్ భద్రత కల్పిస్తుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శ్రీధర్‌రావు అన్నారు. శుక్రవారం బొల్లారం పారిశ్రామికవాడలో మైలాన్ పరిశ్రమ కార్మికులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. కార్మికులు ఈపీఎఫ్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు తప్పనిసరిగా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధి సత్యనారాయణ, వంశీ పాల్గొన్నారు.