
పంట చెల్లింపుల్లో జాప్యం
● పక్షం రోజులైనా పత్తాలేని డబ్బులు ● ఈ పంట బకాయిలు రూ.41.58 కోట్లు ● విడుదలైన వెంటనే చెల్లిస్తామంటున్న అధికారులు
అధికారుల చుట్టూ తిరుగుతున్న జొన్న రైతులు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడం వరకూ ఒక ఎత్తయితే ఆ పంటకు సంబంధించిన డబ్బులు రాబట్టుకోవడం మరో ఎత్తుగా మారింది జిల్లాలోని జొన్న రైతులకు. పంట విక్రయించి 15 రోజులు గడుస్తున్నా చాలామంది రైతులకు ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. దీంతో డబ్బులు రాబట్టుకునేందుకు అన్నదాతలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికై నా జొన్న రైతులకు పంట విక్రయ డబ్బులు చెల్లించడంలో జాప్యాన్ని నివారించాలని కోరుతున్నారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 16 చోట్ల జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సహ కార సంఘాలకు, డీసీఎంఎస్‌లకు అప్పగించారు. ఈ జొన్నలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. సుమారు 20 రోజుల క్రితం ఈ కేంద్రాల్లో జొన్నల సేకరణ ప్రారంభమైంది. ఇప్పటివరకు 4,904 మంది రైతుల వద్ద 12,334 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఈ జొన్నలకుగాను రైతులకు రూ.41.58 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోళ్లు ప్రారంభించి పక్షం రోజులు దాటినప్పటికీ రైతులకు పైసా చెల్లించలేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పెట్టుబడుల అవసరాలకు డబ్బులేవి?
ప్రస్తుతం ఖరీఫ్ పంటసాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం పెట్టుబడుల కోసం డబ్బులు అవసరం ఉంటాయి. అయితే పంట డబ్బులు చేతికందకపోవడంతో రైతులు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ నిధులు విడుదల కాలేవని, విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

పంట చెల్లింపుల్లో జాప్యం