వడ్ల కొనుగోళ్లలో జాప్యం
● రైతుల పడిగాపులు ● మ్యాచర్ రాలేదని ఇబ్బందులుపెడుతున్న సిబ్బంది ● ఖేడ్ పీఏసీఎస్ దుస్థితి
నారాయణఖేడ్: వరి కొనుగోలు కేంద్రాల్లో సక్ర మంగా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణఖేడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ర్యాలమడుగు, నిజాంపేట్‌లలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ర్యాలమడుగు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చిన రైతులు ఎండలో వేచి ఉన్నా తూకం మాత్రం వేయడంలేదు.
తేమశాతం తెలిపే మ్యాచర్ రాలేదంటూ పీఏసీఎస్ సీఈవో కొర్రీలు పెడుతూ తూకం వేయకపోవడంతో రైతులు తమ వడ్లను ఎండలోనే ఆరబెట్టుకుంటున్నారు. కొన్నింటికి మ్యాచర్ వచ్చినా తూకం చేపట్టకపోవడంతో వరి కుప్పలపై బస్తాలను కప్పి ఉంచుతున్నారు. వర్షం పడితే తమ ధాన్యం తడిచిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడవసతి లాంటివి చేపట్టలేదు. అదనంగా తూకం వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
బ్లాక్ లిస్టులో ఉన్న సొసైటీకి కేంద్రాలు..
నాలుగేళ్ల క్రితం కందుల కొనుగోళ్లలో ఖేడ్ పీఏసీఎస్ సొసైటీ అక్రమాలకు పాల్పడింది. రైతుల పేర వ్యాపారుల కందులు కొనుగోలు చేశారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పట్నుంచీ ఈ సొసైటీని బ్లాక్ లిస్టులో పెట్టారు. మార్క్‌ఫెడ్ అధికారులు ఈ సొసైటీకి కందులు, పెసర్లు, జొన్నల కొనుగోళ్లకు అనుమతివ్వరు. కానీ వరి కొనుగోళ్లకు అనుమతించి ఏకంగా రెండు కేంద్రాలను కట్టబెట్టారు. నిజాంపేట్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రం ఉండగా అదనంగా కేంద్రాన్ని ఇవ్వడంపట్ల విమర్శలు వస్తున్నాయి.
మ్యాచర్ వస్తేనే తూకం
మ్యాచర్ రాకపోవడతో తూకం వేయడంలేదు. ఏఈవో వచ్చి మ్యాచర్‌చూసి చెప్పాకనే తూకం వేస్తాం. బ్లాక్‌లిస్టులో ఉన్నందునే మార్క్‌ఫెడ్ ద్వారా కంది, పెసర, మినుము, జొన్నల కేంద్రాలు తమకు ఇవ్వడంలేదు. వరి ధాన్యం సివిల్‌సప్‌లై కావడంతో ఇచ్చారు.
– జగన్నాథం, పీఏసీఎస్ సీఈవో
వడ్ల కొనుగోళ్లలో జాప్యం


