భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి

May 4 2025 8:12 AM | Updated on May 4 2025 8:12 AM

భయంతో

భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి

పెద్దశంకరంపేట(మెదక్‌): వంతెనపై నుంచి దూకడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దశంకరంపేట పెద్ద చెరువు వంతెనపై చోటు చేసుకుంది. పేట శిక్షణా ఎస్‌ఐ అరవింద్‌ కథనం మేరకు.. అల్లాదుర్గం మండలం రాంపురం గ్రామానికి చెందిన బేగరి అనూప్‌ (30)కు భార్య, కూతురు ఉన్నారు. అనూప్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి పెద్దశంకరంపేట నుంచి రాంపురం వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అతడి ముందు బైక్‌పై చిల్వర గ్రామానికి చెందిన రాములు వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన అనూప్‌ రాములు వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఢీకొట్టినందుకు తనను ఏమైనా అంటారేమో అని భయంతో అనూప్‌ వంతెన పక్కన రహదారి ఉందనుకొని చీకట్లో దూకేశాడు. ఈ క్రమంలో కిందపడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి

చేగుంట(తూప్రాన్‌): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్‌ శేర్‌ పంజాబీ దాబా సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. రాజస్థా న్‌ రాష్ట్రం అజ్మీర్‌ జిల్లా కౌడా గ్రామానికి చెందిన ప్రహల్లాద బగ్రియా(39) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లారీని పంజాబీ దాబా వద్ద పార్కింగ్‌ చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపుకు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొనగా ప్రహల్లాదకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

వాహనం ఢీకొని మహిళ

జహీరాబాద్‌ టౌన్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. జహీరాబాద్‌ టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సత్వార్‌ గ్రామానికి చెంది న మేతరి కమలమ్మ(55) శుక్రవారం పట్టణంలోని లిక్కర్‌ కోర్టు సమీపంలో కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపారు.

బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో రైతు..

కొల్చారం(నర్సాపూర్‌): రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్న ఘనాపూర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాగం శ్రీనివాస్‌ (45) వరిగుంతం గ్రామ శివారులోని తన పొలం సమీపంలో గల రోడ్డు పక్కన ధాన్యాన్ని ఆరబెట్టాడు. బుధవారం సాయంత్రం ధాన్యం కుప్పల వద్ద టార్పాలిన్లను సరి చేస్తున్నాడు. ఇదే సమయంలో మెదక్‌ వైపు నుంచి బైక్‌ పై వస్తున్న ఓ వ్యక్తి శ్రీనివాస్‌ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, కుమారుడు ఉన్నారు.

స్నానానికి వెళ్లి యువకుడు

జిన్నారం (పటాన్‌చెరు): స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్‌ రెడ్డి, బాధితుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన మిరియాల శివ, అతడి తమ్ముడు ప్రసాద్‌ (20) రెండేళ్లుగా బొంతపల్లి గ్రామంలో చెత్తడబ్బాలు ఏరుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 1న కటింగ్‌ చేయించుకుంటానని వెళ్లి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం 8 గంటలకు గ్రామ శివారులోని అల్కా చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఒడ్డున ప్రసాద్‌ మృతదేహాన్ని గుర్తించారు. స్నానం చేసేందుకు బట్టలు మెట్లపై పెట్టి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడని తమ్ముడి మరణంలో ఎలాంటి అనుమానం లేదని పోలీసులకు తెలిపారు.

భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి 1
1/1

భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement