
దళిత యువకుడిపై దాడి అమానుషం
చేర్యాల(సిద్దిపేట): మతి స్థిమితం లేని దళిత యువకుడిపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐకి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. మండల పరిధిలోని వేచరేణి శివారు ఎల్లదాసునగర్ బేడ బుడగ జంగాల కులానికి చెందిన ఊపిరి అజయ్‌కుమార్‌కు మతి స్థిమితం సరిగాలేదన్నారు. ఇటీవల యువకుడిపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌కు సంబంధించిన వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునేలా కాళ్లు చేతులు కట్టి, కర్రలతో కొడుతూ, నగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం దారుణమన్నారు. అలాంటి వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మల్లిగారి యాదగిరి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రామగళ్ల నరేశ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూమిగా రాజేందర్, కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బక్కెల్లి బాలకృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సనవాల ప్రసాద్, అంబేడ్కర్ సంఘం నాయకులు జేరిపోతుల పరుశరాములు, మల్లిగారి రాజు, షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి నాయకుడు బుట్టి భిక్షపతి, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కొండ్ర మల్లేశ్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మల్యాల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షుడు మధుకర్, ప్రేమ్‌కుమార్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
పోలీసులకు దళిత సంఘాల నాయకుల ఫిర్యాదు