
శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు
శాంతి సమావేశంలో ఎస్పీ పరితోశ్ పంకజ్
జిన్నారం(పటాన్‌చెరు): చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిన్నారం మండల కేంద్రంలోని తాబేలుగుట్ట శివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విగ్రహధ్వంసం ఘటనపై మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో ఇరువర్గాల సమక్షంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు. విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేసినట్లు సీసీటీవీ ఆధారంగా ఈ సమావేశంలో నిర్ధారించారు. విగ్రహ ధ్వంసం ఘటనలో 28 మందిపై కేసులు నమోదు చేయగా 18 మందిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..పటాన్‌చెరు ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా ఉండేదని ఇటువంటి ఘటనతో ఈ ప్రాంతం వెనకబడటమేకాకుండా అభివృద్ధికి భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని చూసి వాస్తవాలు తెలుసుకోకుండా విద్వేషాలు రెచ్చగొట్టవద్దని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దాడికి సంబంధం లేని కొందరి వ్యక్తులను అరెస్ట్ చేశారని వారిని విడుదల చేయాలని స్థానిక నాయకులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐలు నయీముద్దీన్, నరేశ్, జిన్నారం ఎస్‌ఐ నాగలక్ష్మి, స్థానికనాయకులు మాజీ జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.