
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని ఇసుపకాయ తండాలో సోమవారం ఉదయం విద్యుదాఘాతానికి గేదె మృతి చెందింది. తండాకు చెందిన దేవసోత్ రమేశ్‌కు చెందిన గేదె పంట పొలానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రూ.70 వేల నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
కడ్పల్‌లో మరో గేదె
కల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం కడ్పల్‌లో సోమవారం విద్యుదాఘాతంతో గేదె మృతి చెంది. గ్రామానికి చెందిన రైతు భద్రరెడ్డి సమీపంలో పశువులను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రూ.60 వేల విలువైన గేదె మృతి చెందింది. ప్రభుత్వం నుంచి సహయం అందించాలని బాధితుడు కోరారు.
గంజాయి పట్టివేత
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు కేసీఆర్‌నగర్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చెందిన కరీం, ఇర్షాద్ కలిసి వారికి పరిచయమున్న జాకీర్ ద్వారా మహారాష్ట్రలోని ఘటనందూర్‌కు 20న వెళ్లారు. అక్కడ వసీం, అంజాద్ దగ్గర నుంచి 42 ప్యాకెట్‌ల గంజాయిను కొనుగోలు చేశారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి బోరబండలో 19 ప్యాకెట్ల గంజాయిను విక్రయించారు. అక్కడ నుంచి కొల్లూర్ కేసీఆర్ నగర్‌లో 3 ప్యాకెట్ల గంజాయిను విక్రయించారు. తిరిగి ఆదివారం రాత్రి మిగిలిన గంజాయిను విక్రయించేందుకు కేసీఆర్‌నగర్‌కు వచ్చారు. కచ్చి తమై సమాచారం మేరకు కరీం, ఇర్షాద్‌ను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 111 గ్రాముల గంజాయి స్వా ధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట శివారులో సోమవారం వెలుగు చూసింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ నర్సింలు కథనం మేరకు.. మేడ్చల్ జిల్లా శ్రీరంగవరానికి చెందిన అంతొల్ల రాజశేఖర్(32)మాసాయిపేటకు వివాహ వేడుకకు వచ్చాడు. రాజశేఖర్ ఆదివారం రాత్రి మద్యం సేవించి భార్యతోపాటు వివాహ వేడుకకు హాజరైన బంధువులతో గొడవపడి అదే రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై రాజశేఖర్ మృతదేహం గుర్తించిన స్థానికులు కుటుంబీకులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించగా మద్యం సేవించి రాత్రి జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనని గ్రామస్తులు రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
గొర్రెలు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్) : గొర్రెలు చోరీ అయిన ఘటన మండల కేంద్రమైన శివ్వంపేటలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇసుగారి మల్లేశ్ రోజువారిగానే గొర్రెలను పాకలో ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 5 గొర్రెలను ఎత్తుకెళ్లారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే గ్రామంలో ఇళ్ల ఎదుట పార్క్ చేసిన పలు ద్విచక్ర వాహనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు చోరీ చేశారు.