
భూ సేకరణ పనులు వేగవంతం
అధికారుల సమీక్షలో కలెక్టర్ క్రాంతి
పశువుల అక్రమ రవాణాపై నిఘా
ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), నిమ్జ్‌కు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో భూసేకరణపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించిన భూ వివరాలతో పాటు సేకరించాల్సిన వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జహీరాబాద్‌లోని నిమ్జ్ కోసం సేకరించిన 7,500 ఎకరాల భూమికి రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని సూచించారు. మిగతా భూమితోపాటు రీజనల్ రింగ్ రోడ్డు కోసం గుర్తించిన భూముల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నిమ్జ్ పూర్తయితే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే రవాణా సులభతరంతోపాటు విద్య, వాణిజ్య, వ్యాపార రంగాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు. భూ సేకరణపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అన్ని శాఖల అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, ఆర్‌డీఓలు రాంరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి : పశువుల అక్రమ రవాణాపై నిఘా పెంచడంతోపాటు దానిని అరికట్టాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులకు ఆదేశించారు. గోవుల/ పశువుల అక్రమ రవాణాను నియంత్రిస్తూ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లను ఎస్పీ పరితోశ్ పంకజ్ మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కంది, ముత్తంగి చెక్‌పోస్ట్‌లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.

భూ సేకరణ పనులు వేగవంతం