
కేతకీలో అమావాస్య సందడి
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వరాలయంలో భక్తులతో అమావాస్య సందడి నెలకొంది. మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి, గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. అనంతరం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి, పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించి, ఆశీర్వదించారు. అదేవిధంగా ఆలయ ఆవరణలోని బసవణ్ణమందిరం, నాగులకట్ట, నాగేంద్రుడి ఆలయం, సుబ్రమణ్యస్వామి ఆలయం, పోగడ చెట్టు, నవగ్రహాలు, బలభీముడి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు
అమావాస్యను పురస్కరించుకుని కేతకీ ఆలయంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి అభిషేకం, కూంకుమార్చన, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివరుద్రప్ప, పాలక మండలి సభ్యుడు నవాజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ప్రజలు
భారీగా తరలి వచ్చిన భక్తజనం

కేతకీలో అమావాస్య సందడి