
మూడురెట్లు పరిహారం ఇవ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.15 లక్షలకే నీ ఎకరం భూమిస్తవా?
సంగారెడ్డి ఎడ్యుకేషన్: నిమ్జ్ రైతులకు 2013 చట్టం ప్రకారం మార్కెట్ ధరపై మూడింతలు అదనంగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రతీ ఎకరాకు 120 గజాల ప్లాట్‌ను ఇవ్వాలని, లేని పక్షంలో పారిశ్రామికవేత్తలనే కాదు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినా నిమ్జ్ భూముల్లో అడుగు పెట్టనివ్వబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. నిమ్జ్ ప్రాజెక్టు పేరిట వేలాది ఎకరాల భూములను కోల్పోయిన బాధితులకు చట్ట ప్రకారం పరిహారం రూ.కోటిన్నర , 120 గజాల ప్లాట్స్, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులకు పునరావాసం కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముందు స్థానిక పీఎస్ ఆర్ గార్డెన్ నుంచి వేలాదిమందితో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ...జహీరాబాద్ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు పైనే పలుకుతోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్జ్ కోసం తీసుకుంటున్న భూములకు ఎకరాలకు రూ.15 లక్షల పరిహారమే ఇస్తుందన్నారు. తన ఎకరం భూమిని సీఎం రేవంత్‌రెడ్డి ఇదే రేటుకు ఇచ్చేవారా అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాణిక్యం, సాయిలు, నర్సింహులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
లగచర్ల రైతులకొక న్యాయం.. నిమ్జ్ బాధితులకు మరో న్యాయమా?
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ