
వేధింపులు తట్టుకోలేకపోతున్నాం
మెదక్ కలెక్టరేట్: మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక పోతున్నాం.. వారి నుంచి రక్షించకుంటే మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు సోమవారం తమను కాపాడాలంటూ అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్‌కు చెందిన శేఖర్ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ భార్యతోపాటు ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. అవసరం కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రూపు సభ్యులతో కలిసి ఓ మైక్రో ఫైనాన్స్ బంధన్ బ్యాంకులో గతేడాది క్రితం రూ.1.10 లక్షలు అప్పు తీసుకున్నాను. భార్యాభర్తల అనారోగ్యం కారణంగా ఆర్థిక సమస్య ఏర్పడింది. అప్పు వాయిదాలు కట్టేందుకు ఫిన్‌కేర్‌లో రూ.50 వేలు, మళ్లీ డీసీబీ ప్రైవేట్ బ్యాంకులో రూ.60 వేలు, టాటా క్యాపిటల్ బ్యాంకులో రూ.50 వేల అప్పు తీసుకున్నాడు. ఆరోగ్యం సహకరించకపోయినా కష్టపడి వాయిదాలు కడుతూనే ఉన్నాడు. ఒక్క వాయిదా ఆలస్యమైనా గ్రూప్ సభ్యులను ఇంటికి పంపి ఇంటికి తాళం వేస్తామంటూ బెదిరిస్తున్నారు. రోజు రోజుకూ వేధింపులు ఎక్కువయ్యాయని కలెక్టర్ స్పందించి న్యాయం చేయకుంటే మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని కుటుంబమంతా కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన అదనపు కలెక్టర్ నగేశ్ సమస్య పరిష్కరించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు సూచించారు.
కుటుంబమంతాఆత్మహత్య చేసుకుంటాం
అదనపు కలెక్టర్‌కు మొరపెట్టుకున్న బాధిత కుటుంబం