
మొలకలొచ్చిన ధాన్యం.. రైతులు ఆగం
వడ్లు మొలకలొచ్చినయ్..
15 రోజుల నుంచి వానకు తడవడం మళ్లీ ఎండబోయడం ఇదే పని. తడిసిపోయి వడ్లు మొలకలొచ్చినయ్ ఏం జేయాలో తోస్తలేదు. మొలకలొచ్చిన వడ్లను వేరు చేస్తూ కవర్‌లలో ఎండబోయడం మళ్లీ కుప్పజేయడం ఇదే పని.అందరివి మొలకలు వచ్చినయ్. కుప్పలు జేసిన వానకు వరద వచ్చి కిందనుంచి మొలకలు వస్తున్నాయి. వెంటనే కొనకుంటే ధాన్యం చేతికిరాకుండా పోతుంది.
– మూర్తి బాపురెడ్డి, రైతు
వర్షాలతో ఇబ్బందిగా తయారైంది
వర్షాలతో ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది తయారైంది. రోజు వర్షం కురుస్తుండటంతో ఎండిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానలు లేకుంటే ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యేది. కేంద్రాల్లో మిగిలిన ధాన్యం త్వరగా కొనుగోలుకు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
– రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి
● వానలు వస్తుండటంతో కాపాడుకునేందుకు పడరాని పాట్లు
● జిల్లాలో 90 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
● ఇంకా కేంద్రాల్లో 80 వేల టన్నులకు పైగా ధాన్యం
● త్వరగా కొనుగోలు చేయాలంటూ వేడుకోలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు గుమ్మడిదల లక్ష్మీ. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ గ్రామం. 15 రోజుల కిందట వరి పంట కోసి వడ్లు కొనుగోలు కేంద్రంలో పోసింది. వానకు వడ్లు తడిసి మొలకలొచ్చాయి. ఎంత ప్రయత్నించినా ధాన్యంను కాపాడుకోలేకపోతున్నానని ఎండిన వడ్లు తడిసి మళ్లీ మొలకలు వచ్చినయి ఏం జెయాల్నో తోస్తలేదంటు మొలకలొచ్చిన ధాన్యం చూపిస్తూ లక్ష్మీ కన్నీరు పెట్టింది. ఇది ఒక్క లక్ష్మీదే కాదు జిల్లాలోని చాలా మంది రైతులది ఇదే గోస.
దుబ్బాక : రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. రైతుల మీద పగబట్టినట్లుగా రోజు వర్షం దంచికొడుతుండడంతో ధాన్యం పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వానలకు ఎండిన వడ్లు తడవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసిన మొలకలొచ్చిన వడ్లనే చూపిస్తూ రైతులు కన్నీరు పెడుతున్నారు.
3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అకాల వర్షాలతో ఇబ్బందిగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడం, వరదలో కొట్టుకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నేటి వరకు జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాల ద్వారా దొడ్డు రకం ధాన్యం 3.30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు జరుగగా, సన్నరకం కేవలం 470 మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది. ఇప్పటి వరకు 90 శాతం వరకు కొనుగోలు పూర్తి అయ్యిందని ఇంకా 10 శాతంలోపు 80 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంటుందని అధికారుల అంచనా వేశారు.

మొలకలొచ్చిన ధాన్యం.. రైతులు ఆగం

మొలకలొచ్చిన ధాన్యం.. రైతులు ఆగం

మొలకలొచ్చిన ధాన్యం.. రైతులు ఆగం