
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన తుడం సుధాకర్(35)తో నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామానికి చెందిన అరుణకి నాలుగేళ్ల కింట వివాహమైంది. మూడేళ్లుగా హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో చల్మెడ గ్రామంలో తెలిసిన వారి వద్ద అవసరానికి అప్పులు చేశారు. ఏడాది కిందట అరుణ తల్లిదండ్రులు మృతి చెందడంతో జప్తిశివనూర్ గ్రామానికి వచ్చి జీవిస్తున్నారు. చల్మెడలో ఎకరం, జప్తిశివనూర్‌లో మరో ఎకరం పొలం ఉండగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. పెళ్లి జరిగి నాలుగేళ్లు అయినా పిల్లలులేరు. దీనికి తోడు శుక్రవారం చల్మెడ గ్రామంలో అప్పు ఇచ్చిన వారు జప్తిశివనూర్‌కు వచ్చి అప్పుకట్టాలని అడిగి వెళ్లారు. మనస్తాపానికి గురైన సుధాకర్ శనివారం కోత మిషన్ వస్తుందని చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య అరుణ పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
భార్య కళ్లెదుటే ఉరేసుకొని భర్త
సంగారెడ్డి క్రైమ్: భార్య కళ్లెదుటే భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన మన్నె వినోద్ (25) స్థానికంగా ఆటో డ్రైవర్. నాలుగేళ్ల కిందట కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మౌనిక వృత్తిరీత్యా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. భర్త మీద కోపంతో మౌనిక 3న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 24న తన భర్త నిత్యం వేధిస్తున్నాడని కొండాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి భార్యను అతడి వెంట సంగారెడ్డిలోని ఇంటికి పంపించారు. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. తీవ్ర మనోవేదనకు గురై వినోద్ భార్య కళ్లెదుటే గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య