
పాఠశాలలో టీచర్ల డుమ్మా
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఇష్టానుసారంగా విధులకు ఎగనామం పెడుతుండటంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఏదో ఓ చోట ప్రభుత్వ పాఠశాలలపై ఆరోపణలు వస్తున్నా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. నారాయణఖేడ్ పట్టణానికి కిలోమీటరు దూరంలో..ఎంపీడీవో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న జూకల్ తండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు బాబురావు, కవిత బుధవారం పైఅధికారులకు చెప్పా పెట్టకుండా బడి నుంచి వెళ్లిపోయారు. ఈ పాఠశాలలో 30మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులూ పాఠశాలలో లేరు. దీంతో విద్యార్థులు ఆరుబయట, రోడ్డు వెంట ఆడుతూ కన్పించారు. తమకు తలనొప్పి వస్తోందని, తనను పాఠశాలను చూస్తుండమని పక్కనే ఉన్న అంగన్‌వాడీ టీచర్ సాంకీబాయికి చెప్పి టీచర్లు ఇద్దరూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉపాధ్యాయులూ ఒకేసారి విధులకు డుమ్మా కొట్టి వెళ్లిపోవడంతో పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డీఈవో వెంకటేశ్వర్లు వద్ద టీచర్ల డుమ్మా విషయాన్ని ప్రస్తావించగా ఎంఈవోను పంపించి విచారణ చేయిస్తానని సమాధానం ఇచ్చారు.
తరగతి గదులు వదిలి
ఆరుబయటే ఆడుకున్న విద్యార్థులు
రోడ్డు పక్క పాఠశాల కావడంతో
స్థానికుల ఆందోళన

పాఠశాలలో టీచర్ల డుమ్మా