నాటి చరిత్రకు నేటి సాక్ష్యాలు.. | Sakshi
Sakshi News home page

నాటి చరిత్రకు నేటి సాక్ష్యాలు..

Published Thu, Apr 18 2024 10:35 AM

నర్మేటలో మేన్‌హీర్‌ వద్ద గుర్తించిన బండరాయిని పరిశీలిస్తున్న అధికారులు   - Sakshi

● భూగర్భంలో ఆదిమానవుని అవశేషాలు లభ్యం ● సిద్దిపేట జిల్లా నర్మేట, పాలమాకుల, మగ్దూంపూర్‌, పుల్లూర్‌లో బహిర్గతం ● నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం

నంగునూరు(సిద్దిపేట): కాల గర్భంలో కలిసిపోయిన చరిత్ర, కళ్ల ముందున్న కట్టడాలు, భూగర్భంలో నిక్షిప్తమైన చారిత్రాత్మక ఆధారాలు, వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 18న వరల్డ్‌ హెరిటేజ్‌డేను జరుపుకుంటున్నారు. దేశ చరిత్రను భావితరాలకు అందించేందుకు పురావస్తుశాఖ తోపాటు తెలంగాణ కొత్త చరిత్ర బృందం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా పుల్లూర్‌, నంగునూరు మండలం నర్మేట, పాలమాకుల, మగ్ధుంపూర్‌లో 2017 ఏప్రిల్‌ పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. అక్కడ ఆదిమానవుని అవశేషాలు, రాతి యుగపు పాత్రలు, మృణ్మన పాత్రలు, మెన్‌మీర్‌లు, ఆహార అలవాట్లను గుర్తించి హైదరాబాద్‌లోని పురావస్తుశాఖ కార్యాలయంలో భద్ర పరిచారు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో బహిర్గతమైన అవశేషాలపై ప్రత్యేక కథనం..

ఎంత పెద్ద బండరాయో..

నర్మేటలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న సమాధి బహిర్గతమైంది. బండరాయి (క్యాప్‌ స్టోన్‌) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 65 సెంటీమీటర్ల మందంతో 43 టన్నుల బరువు ఉండగా క్రేన్‌ సహాయంతో 2 గంటలపాటు కష్టపడి బండను పక్కకు తొలగించారు.

మానవుని సమాధి

పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఆది మానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్‌) స్వస్తిక్‌ ఆకారంలో చుట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు.

కఫ్‌మాక్స్‌

నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్‌మాక్స్‌లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్‌, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండలపై చెక్కేవారు.

ఎముక ఆభరణాలు

మేన్‌హీర్‌ వద్ద జరిపిన తవ్వకాల్లో ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్‌ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు.

చెక్కు చెదరని దంతాలు, ఎముక

మేన్‌హీర్‌ వద్ద ఉన్న పెద్ద సమాధిలో తెగ పెద్దగా భావిస్తున్న మహిళ 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దంతా లు ఇప్పటికి చెక్కు చెదరకపోవడం విశేషం.

శంఖాలు (కౌంచ్‌)

చూడగానే రెండు సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు పూజ చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా ఊదేందుకు దీన్ని వాడేవారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

భావితరాల వారికి అందించాలి

పురాతన కాలం నాటి చరిత్ర, సాంస్కృతిని భావి తరాలవారికి అందించాలి. గ్రామాల్లో తిరిగి ఎన్నో అధ్యయనాలు జరిపి చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వం చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలి.

– కొలిపాక శ్రీనివాస్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, నంగునూరు

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
 
Advertisement
 
Advertisement