
ఏనుగులూ పేర్లతో పిలుచుకుంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు
ప్రత్యేక శబ్దంతో తమ గుంపులోని ఏనుగులకు సిగ్నల్స్
మనుషుల మాదిరిగానే ఏనుగులకు ప్రత్యేక భాష ఉన్నట్టు గుర్తింపు
అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
సాక్షి, అమరావతి: మనం ఒకరినొకరు పేర్లతో పిలుచుకోవడం సహజం. ఇలా పేర్లు పెట్టుకుని సంబోధించుకోవడానికి మాట్లాడటం రావాలి. అందుకు ఓ భాష కూడా కావాలి. అది మనుషులకు మాత్రమే సాధ్యమనే భావన నిన్నమొన్నటి వరకు భావించేవారు. కానీ.. కొన్ని రకాల వన్యప్రాణులు కూడా మాట్లాడుకుంటాయని.. వాటికి కూడా భాష ఉంటుందని వివిధ పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు అలా మాట్లాడుకునే వన్య ప్రాణుల్లో ఏనుగులు కూడా ఉన్నాయని తాజాగా గుర్తించారు. అడవుల్లో జీవించే ఏనుగులు పేర్లతో పిలుచుకుంటాయని తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ మైకేల్ బార్టో నేతృత్వంలోని బృందం కెన్యాలోని ఆఫ్రికన్ ఏనుగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఏనుగులు చేసే రకరకాల శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డు చేసి వాటి ప్రవర్తనను గమనించారు. అవి తమ గుంపులోని ఇతర ఏనుగులను గుర్తించడానికి ప్రత్యేకమైన, తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను (ఇన్‌ఫ్రా సౌండ్) ఉపయోగిస్తాయని కనుగొన్నారు. ఈ శబ్దాలు మనం పేర్లుగా భావించే వాటితో సమానమని తేలింది. ఒక ఏనుగు తన సమూహంలోని మరో ఏనుగును పిలవాలనుకుంటే ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని చేస్తుంది. అది ఆ ఏనుగు మాట్లాడాలనుకున్న మరో ఏనుగుకు మాత్రమే సంబంధించిన శబ్దం అని స్పష్టమైంది. ఒక్కో ఏనుగుకు ఒక్కో ప్రత్యేకమైన శబ్దం ఉంది. ఈ శబ్దాలు కామన్‌గా ఇతర అన్ని జంతువులు ఒకే రకంగా చేసేలా లేకపోవడం ఈ పరిశోధనలో గుర్తించిన కీలకమైన అంశం.
ఏఐ టెక్నాలజీతో శబ్దాల విశ్లేషణ
శాస్త్రవేత్తలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల శబ్దాలను విశ్లేషించారు. పరిశోధకులు ఒక గుంపులోని ఏనుగులను గుర్తించేందుకు పేర్లు పెట్టారు. అందులో ఒక ఏనుగుకు ’మాంబా’ అని పేరు పెట్టి దాన్ని నిరంతరం గమనించారు. ’మాంబా’ ఒక నది దగ్గర నీళ్లు తాగుతుండగా, గుంపులోని మరో ఏనుగు దాన్ని పిలవడానికి ఒక ప్రత్యేకమైన గుండ్రని శబ్దాన్ని చేసింది. ఆశ్చర్యకరంగా ’మాంబా’ మాత్రమే ఆ శబ్దానికి స్పందించి తల ఎత్తి ఆ దిశగా చూసింది. మిగతా ఏనుగులు ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు. దీనిద్వారా ఏనుగులు వ్యక్తిగత పేర్లను ఉపయో గిస్తాయని నిర్థారణ అయింది.
అసాధారణ మేధస్సు గజరాజుల సొంతం
సాధారణంగా అడవి జంతువులు ఒకే రకమైన అరుపులు, శబ్దాల ద్వారా సంభాషించుకుంటాయి. ఈ శబ్దాలన్నీ కామన్‌గా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక్కో రకమైన శబ్దాలు ఉండవు. కానీ.. ఏనుగులు ప్రత్యేకంగా మనుషుల మాదిరిగానే సంభాషించుకునేలా శబ్దాలు చేసుకోవడం కొత్త విషయం. అవి ఒక శబ్దాన్ని చేయడంతోపాటు అది ఎవరు చేశారో, ఎవరి కోసం చేశాయో కూడా గుర్తించగలుగుతున్నాయి. అంటే వాటికి బుద్ధితో ఆలోచించే సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమైంది. ఏనుగులు బలమైనవే కాదు.. అసాధారణమైన మేధస్సు కలిగిన సామాజిక జీవులని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
డాల్ఫిన్లు, చిలుకలకు ప్రత్యేక భాష
ఇప్పటివరకు డాల్ఫిన్లు, చిలుకలు ఒకదాన్ని ఒకటి గుర్తించడానికి శబ్దాలను చేస్తాయని భావించేవారు. ఒక డాల్ఫిన్ తన సమూహంలోని మరో డాల్ఫిన్ చేసే స్వరాన్ని అనుకరించి దాన్ని పిలుస్తుంది. కానీ.. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలను ఉపయోగిస్తుండటం.. అవి మనుషుల సంభాషణ పద్ధతికి చాలా దగ్గరగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏనుగులు తమ సమూహంలో ఉన్న ఇతర ఏనుగులతో బలమైన బంధాలను ఏర్పర్చుకుంటాయి.
కలిసి ప్రయాణించడం, కలిసి ఆహారం సేకరించడం, శత్రువుల నుండి ఒకదానిని మరొకటి రక్షించుకోవడం ద్వారా తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకుంటాయి. అయితే వాటికి ఒక శబ్దాల భాష ఉన్నట్టు తాజాగా బయటపడటంతో అవి మనుషులతో చాలా దగ్గరగా ఉన్నట్టు తేలింది. ‘ఏనుగులు మనం ఊహించిన దానికంటే ఎక్కువ సంక్లిష్టతను కలిగి ఉన్నాయి. వాటి సామాజిక నిర్మాణం, సంభాషణ పద్ధతులు మనుషులతో సమానంగా ఉన్నాయి’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక శాస్త్రవేత్త తెలిపారు.