
ఉత్పత్తులకు సరికొత్త ‘హెల్త్ ట్యాగ్’ పేరులోనే ప్రోటీన్ ప్రస్తావన
అమూల్, బ్రిటానియా, ఐటీసీ.. అన్నీ ఇదే బాటలో లేబుళ్లను జాగ్రత్తగా చదవాలి
ఐసీఎమ్‌ఆర్ – ఎన్‌ఐఎన్ సూచన
గతంలో అన్ని పోషకాలూ ఇందులోనే ఉన్నాయి అంటూ పాలల్లో కలుపుకొని తాగే పొడులు, బిస్కట్ల వంటివాటిని కంపెనీలు తీసుకొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. కరోనా తరవాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. రాగి ఇడ్లీ మొదలు మొలకలు, ఫ్రూట్ సలాడ్లు, చిరు ధాన్యాల వంటకాలు.. ఇవన్నీ చాలామంది నిత్య జీవితంలో భాగమైపోయాయి. విడివిడిగా పోషకాలు, వాటి అవసరంపై అవగాహనా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని కంపెనీలు ప్రోటీన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. మా ఉత్పత్తిలో అత్యధిక ప్రోటీన్ ఉందంటూ ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మనకు రోజువారీ ఎంత ప్రోటీన్ కావాలి? అది ఎలా లభిస్తుంది? భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఏం చెబుతున్నాయి? –(సాక్షి, స్పెషల్ డెస్క్)
అమూల్ కంపెనీ ఇటీవల ‘ప్రోటీన్ కుల్ఫీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని ప్యాక్‌మీద పెద్దగానే ముద్రించింది. అమూల్ ఇప్పటికే బటర్ మిల్క్, రోజ్ లస్సీ, కూల్ కేసర్, కూల్ కాఫీ, టిన్ పనీర్ వంటి వాటిని ‘హై ప్రోటీన్’ పేరుతో విక్రయిస్తోంది. ఇంకా ఆసక్తికరం ఏంటంటే.. ప్రోటీన్ సమోసా, ప్రోటీన్ వడాపావ్ వంటివి కూడా తీసుకొచ్చింది. అలాగే మిల్కీ మిస్ట్ కంపెనీ ‘స్కైఆర్’– హై ప్రోటీన్ పెరుగు తీసుకొచ్చింది.
ఇందులో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. ఐటీసీ కంపెనీ ‘ఆశీర్వాద్’ ఉత్పత్తుల్లో భాగంగా...నమ్మ చక్కీ పేరిట గోధుమ పిండి విక్రయిస్తోంది. ఇందులోనూ ‘హై ఇన్ ప్రోటీన్’ అని ప్యాక్ మీదే ముద్రించి, ప్రతి 100 గ్రాముల్లో 14.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని రాశారు.బ్రిటానియా కంపెనీ ‘బి యు’ పేరిట ప్రోటీన్ బార్‌లు తెచ్చింది. 45 గ్రాముల ఈ బార్‌లో 10.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని పేర్కొంది. ఇవేకాదు, ఇంకా చాలా కంపెనీలు.. ఇప్పుడు ప్రోటీన్ మంత్రం జపిస్తున్నాయి. కరోనా తరవాత ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహను దృష్టిలో పెట్టుకుని, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి.
ఐసీఎమ్‌ఆర్ – ఎన్‌ఐఎన్ ఏమంటున్నాయి?
భారతీయులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పూర్తి మార్గదర్శకాలతో ఐసీఎమ్‌ఆర్ – ఎన్‌ఐఎన్... ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024’ పుస్తకం వెలువరించాయి. శరీరంలో ఎంజైములు, హార్మోన్లు, హిమోగ్లోబిన్, కణత్వచం భాగాల వంటివాటి తయారీ.. ఇలాంటి ఎన్నో పనులకు ప్రోటీన్లు చాలా అవసరం. విరిగిపోయిన కణజాలాల స్థానే కొత్తవాటి కోసమూ ప్రోటీన్లే కావాలి. ఎదిగే పిల్లల్లో కండరాలు, ఎముకల నిర్మాణానికీ ఇవే అవసరం.
ఎంత ప్రోటీన్ అవసరమంటే
ఐసీఎమ్‌ఆర్ – ఎన్‌ఐఎన్ సూచనల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి... తన శరీరంలో ప్రతి కేజీ బరువుకీ రోజుకి 0.83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అంటే సగటున 25 కేజీల బరువుండే మనిషి రోజుకి సుమారు 21 గ్రాముల ప్రోటీన్, 50 కిలోలుంటే 42 గ్రాములు, 65 కిలోలుంటే 54 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అలాగని ప్రోటీన్ ఉండే ఆహారం ఒక్కటే తీసుకుంటే.. కండరాల బలం పెరగదు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా చాలా అవసరం.
అంతేకాదు, రోజూ సరిపడా శారీరక వ్యాయామం చేయకపోయినా మనం తీసుకున్న ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడవు. మార్కెట్లోకి కొన్ని కంపెనీలు ప్రోటీన్ పౌడర్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఇందులో అదనంగా షుగర్లు, స్వీటెనర్లు, ఇతరత్రా కృత్రిమ పదార్థాలు ఉంటున్నాయి. ప్రోటీన్ సప్లిమెంట్ల రూపంలో అత్యధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఐసీఎమ్‌ఆర్ చెబుతోంది. చాలామంది అథ్లెట్లు సప్లిమెంట్ల అవసరం లేకుండానే.. తమ రోజువారీ ఆహారంలో నుంచే తమ శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందగలుగుతారని స్పష్టం చేస్తోంది.
లేబుల్ చదవాలి
మార్కెట్లో ఏ వస్తువు కొన్నా లేబుల్ మాత్రం తప్పనిసరిగా చదవాలని ఐసీఎమ్‌ఆర్ సూచిస్తోంది. ఉదాహరణకు ‘తక్కువ కొవ్వులు (లో ఫ్యాట్)’ అని లేబుల్‌లో రాస్తారు. కానీ, ఆ ఉత్పత్తి ద్వారా చాలా క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మిగతా సమాచారాన్ని కూడా చదవాలి. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్ డి.. వంటివి లేబుల్‌లో రాసి ఉంటే.. సింగిల్ సెర్వింగ్ ద్వారా 10 నుంచి 19 శాతం ఆ పోషకం మనకు అందే అవకాశం ఉంటుంది.
ప్రోటీన్లు అత్యధికంగా ఉండేవి
⇒ మాంసం, గుడ్లు, చికెన్, చేపలు
⇒ పాలు, పప్పు దినుసులు, సోయా బీన్, కిడ్నీ బీన్స్, బఠానీ, పెసలు, శెనగలు, బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రోటు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, క్వినోవా మొదలైనవి
⇒ మాంసాహారులకు వారంలో 700 –900 గ్రాముల చేపలు లేదా చికెన్ తినడం వల్ల వారికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది.
ప్రాసెస్డ్ ఫుడ్ కొనేస్తున్నారు
కేంద్ర గణాంక శాఖ ‘గృహ వినియోగ వ్యయ సర్వే’ ప్రకారం... పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున చేసే ఖర్చు 2022–23తో పోలిస్తే 2023–24లో పెరిగింది.