ఓటీటీ రిలీజ్‌.. సూపర్‌ హిట్‌! | OTT viewers across the country has reached 55 crore by 2024 | Sakshi
Sakshi News home page

ఓటీటీ రిలీజ్‌.. సూపర్‌ హిట్‌!

Jun 22 2025 4:40 AM | Updated on Jun 22 2025 4:40 AM

OTT viewers across the country has reached 55 crore by 2024

ఓవర్‌ ద టాప్‌.. సంక్షిప్తంగా ఓటీటీ. వినోద రంగాన్ని సమూలంగా మార్చి కొత్త రికార్డులకు వేదికవుతోంది. దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య  2024 నాటికి 55 కోట్లకు చేరిందంటే దీని స్పీడును అర్థం చేసుకోవచ్చు. టెలికం కంపెనీల దూకుడు పుణ్యమాని నగరాలే కాదు పల్లెలకూ ఆన్ లైన్ లో వీడియో స్ట్రీమింగ్‌ సంస్కృతి పాకింది. ఈ స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టే నేరుగా ఓటీటీల్లో (ఒరిజినల్స్‌) రిలీజయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్, షోల సంఖ్య మన దేశంలో భారీగా పెరిగాయి. దేశంలో సగటున రోజుకో ఓటీటీ ఒరిజినల్‌ విడుదలై వీక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

2021లో మొత్తం ఓటీటీ ఒరిజినల్స్‌లో సినిమాల వాటా ఏకంగా 53 శాతం నమోదై రికార్డు సృష్టించింది. మహమ్మారి సమయంలో థియేటర్లు చాలా కాలం పాటు మూతపడ్డాయి. థియేటర్లో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాలు మరో మార్గం లేక ఓటీటీ బాట పట్టాయి. అయితే 2022 నుండి వెబ్‌ సిరీస్‌ల ఆధిపత్యం కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో వెబ్‌ సిరీస్‌ల వాటా ఏటా 68–71 శాతం ఉంది. 2024లో రిలీజైన 315 ఒరిజినల్స్‌లో 214 వెబ్‌ సిరీస్‌లే. 2023లో ఈ సంఖ్య 272గా ఉంది. మొత్తం ఓటీటీ వీక్షకుల్లో 27.5 శాతం (15 కోట్లు) మంది పెయిడ్‌ కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. మిగిలిన 72.5 శాతం మంది ఉచితంగా అందుబాటులో ఉన్న కంటెంట్‌ను వీక్షిస్తున్నారు.

ప్రాంతీయ భాషలపై ఫోకస్‌
2021 నుంచి చూస్తే.. మొత్తం ఒరిజినల్స్‌లో మూడింట రెండొంతులు హిందీ కంటెంట్‌ కైవసం చేసుకుంది. దేశంలో గత ఏడాది ఓటీటీల్లో ప్రత్యక్షమైన ఒరిజినల్స్‌లో 65% వాటాతో హిందీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హొయిచొయి, క్లిక్, అడ్డాటైమ్స్‌ వంటి ఓటీటీ యాప్స్‌ దూకుడుతో బెంగాలీ 2వ స్థానాన్ని సంపాదించింది. దాదాపు 9 శాతం వాటాతో తెలుగు మూడో స్థానంలో ఉంది.  తెలుగులో ‘ఆహా’ యాప్‌ 27 లక్షల మంది చందాదారులతో దూసుకుపోతోంది. 

ఇతర భాషలతో పోలిస్తే హిందీతోపాటు బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళంలో సృజనాత్మకత మెరుగ్గా ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఇతర పెద్ద ప్లాట్‌ఫామ్‌లు ఈ ప్రాంతీయ భాషలపై దృష్టి సారించాయి. దక్షిణాదిన ఓటీటీ వినియోగాన్ని సినిమాలే నడిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద హిట్స్‌లో దాదాపు 70 శాతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్  ప్రైమ్‌లలోనివే. మిగిలినవి జియో హాట్‌స్టార్, సోనీ లివ్‌లో ప్రసారం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement