ధీమా ఇవ్వని బీమా! | - | Sakshi
Sakshi News home page

ధీమా ఇవ్వని బీమా!

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

ప్రభుత్వం ఆదుకోవాలి

పరిగి: నేలతల్లిని నమ్ముకుని జీవించే రైతు కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలవాల్సిన రైతు బీమా పథకంపై అనిశ్చితి నెలకొంది. ఆగస్టు 14వ తేదీతో ప్రీమియం చెల్లింపు గడువు ముగిసింది. ప్రభుత్వ జాప్యంతో పథకం అమలుపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తమ కుటుంబాలకు బీమా రక్షణ ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. పథకం అమలులో జాప్యం జరిగితే బాధిత కుటుంబాలు ఆర్థికంగా మరింత కష్టాల్లోకి కూరుకుపోతాయి. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు, అప్పులు చేసిన సాగుచేసిన పంటలపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు బీమా భరోసా అత్యవసరం. ఎల్‌నినో ప్రభావంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు చనిపోతే అనేక అవస్థలు పడాల్సిందే. రైతు బీమా స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ బీమాకు శ్రీకారం చుట్టింది. పథకం అమలు ఆలస్యం అవుతుండటంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.

316 కుటుంబాల ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 316 రైతు కుటుంబాలు బీమా డబ్బు కోసం ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వం 2018 ఆగస్టు 14వ తేదీ నాటికి 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులను అర్హులుగా నిర్ధారించి పథకాన్ని ప్రారంభించింది. రైతు ఏదైనా కారణంతో మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తాన్ని వారం నుంచి పది రోజుల్లో నామినీ ఖాతాలో జమయ్యేవి. ఏటా ఆగస్టు 14వ తేదీ లోపు ప్రభుత్వమే ప్రీమియం మొత్తం చెల్లించేది. ఈ ఏడాది జాప్యంతో 136 బాధిత కుటుంబాలకు బీమా అందని పరిస్థితి నెలకొంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 87 మంది, వికారాబాద్‌ జిల్లాలో 29 మంది ఉన్నారు. వికారాబాద్‌లో పట్టా పాసుపుస్తకాలు 2,79,789 ఉండగా 1,52,580 మంది అర్హులైన రైతులు ఉన్నారు. పథకం అమలు నుంచి 8,206 మంది చనిపోగా బాధిత కుటుంబాలకు రూ.410.30 కోట్లు చెల్లించారు. సెప్టెంబర్‌ వరకు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న 211 మందికి సంబంధించిన డబ్బు పెండింగ్‌లో ఉంది. వారికి చెల్లించాల్సిన మొత్తం రూ.10.55 కోట్లు. ఆగస్టు తర్వాత 49 మంది రైతులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో పట్టా పాసుపుస్తకాలు కలిగిన రైతులు 1,71,763 మంది ఉండగా ఇప్పటి వరకు 7,305 మంది చనిపోగా వారి కుటుంబాలకు రూ.366.25 కోట్లు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 105 మందికి సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆగస్టు తర్వాత 87 మంది రైతులు చనిపోయారు.

మరణాల నమోదుతో సరి

ప్రభుత్వం రైతు బీమా పథకం పేరు మార్పు కోసం తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఆగస్టు 14 నుంచి పథకం నిలిచిపోవడంతో తర్వాత మృతి చెందిన రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యవసాయ అధికారులు మాత్రం మృతి చెందిన వారి పేర్లను నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ఎల్‌ఐసీకి బీమా ప్రీమియం చెల్లించనందున డబ్బులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారి వివరాల నమోదుకు లాగిన్‌ ఉంది కానీ ఎలాంటి పత్రాలు తీసుకోవడానికి లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం స్పందించి బీమా డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పరిగి మున్సిపల్‌ పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన రైతు ఇప్పపల్లి రాములు (55) ఆగస్టు 28న గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. బీమా డబ్బు కోసం బాధితులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్తే అధికారులు డెత్‌ రికార్డు మాత్రమే చేస్తున్నాం అని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని అంటున్నారు. ఆగస్టు 14 కన్నా ముందు చనిపోయిన అన్నదాతలకు మాత్రమే రైతు బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీంతో రాములు కుటుంబంలో ఒకింత ఆందోళన నెలకొంది.

రైతు చనిపోయినా అందని డబ్బు

ప్రీమియం చెల్లింపులో ప్రభుత్వ జాప్యం

మరణాల నమోదుతో సరిపెడుతున్న వ్యవసాయ శాఖ

ఖరారు కాని ఇందిరమ్మ బీమా పథకం విధివిధానాలు

రక్షణ కోల్పోతున్న బాధిత కుటుంబాలు

నా భర్త చాకలి మల్లయ్య (35) సెప్టెంబర్‌ 10న అకాల మరణం పొందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ముగ్గురు కూతుళ్లను పోషించడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం బీమా డబ్బులు ఇస్తుందనే ధైర్యంతో ఉన్నాం. ఇప్పటికే వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేశాం. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

– చాకలి, పద్మ, నస్కల్‌, పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement