ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని.. | - | Sakshi
Sakshi News home page

ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని..

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

యువకుడి బలవన్మరణం

శంకర్‌పల్లి: ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్‌ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండా నర్సింలుకి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నవాడైన ప్రశాంత్‌ (24) నగరంలోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ యువతిని పెళ్లి చేసుకుందాం అని అడిగే సరికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన అతను శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. రాత్రి 10గంటలు దాటినా ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికారు. చివరికి పొలంలోని మామిడి చెట్టుకి ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

శంకర్‌పల్లి: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రావులపల్లి కలాన్‌లో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్‌ అలీ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రేశం బుచ్చయ్యకి ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మల్లేశం(34) పూల డెకరేషన్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి ఎనిమిదేళ్ల క్రితం తాండూరుకి చెందిన నవనీతతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె సంతానం. ఏడాది క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నవనీత పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మల్లేశంకి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. తర్వాత కోలుకున్నప్పటికీ ఒంటరితనంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

గుర్తు తెలియని వాహనం ఢీ

యువకుడు మృతి

కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పెంజర్ల కూడలిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చందన్‌కుమార్‌(25) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

ఉరేసుకుని

వ్యక్తి బలవన్మరణం

మణికొండ: ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శనివారం వెలుగుచూసింది. ఎస్సై మురళీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఖానాపూర్‌ సర్వేనెంబర్‌ 65లోని చెట్ల పొదలలో 30–35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో స్థానికులకు కనిపించిందన్నారు. వారి సమాచారంతో వెళ్లి చూడగా అతను 10 రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని, ప్రహరీ, ఫెన్సింగ్‌కి ఉన్న ఖాళీ స్థలంలో తన షర్ట్‌తో ఉరేసుకుని ఉన్నట్టు తెలుసుకున్నామన్నారు. మృతదేహాన్ని ఉస్మాని యా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement