షాద్‌నగర్‌రూరల్: తాంత్రిక పూజలతో డబ్బుల వర్షం(పైసా బారిష్) కురిపిస్తామంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు గుర్తు తెలియని దుండుగులు. ఈ ఘటన షాద్‌నగర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన భాషాకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తూ మీరు కొంత డబ్బులను తీసుకువస్తే గురుస్వాములతో తాంత్రిక పూజలు చేయించి పైసా బారిష్ కురిపిస్తామంటూ నమ్మించారు. దీంతో ఆయన తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు షాద్‌నగర్‌లో ప్లాట్ కొన్నానని ఇద్దరు మిత్రుల నుంచి రూ.పది లక్షలు అప్పుగా తీసుకుని రెండు రోజుల క్రితం పట్టణానికి చేరుకున్నాడు. తనకు పంపిన లొకేషన్‌తో పరిగి రోడ్డులోని పారడైజ్ కాలనీకి చేరుకుని సదరు వ్యక్తులకు ఫోన్ చేశాడు. దీంతో ఆయన్ను అక్కడే ఉండాలని సూచించారు. కాసేపటికి బైక్‌పై వచ్చిన వ్యక్తి ముందు వెళుతూ భాషాను కారులో అతనితో పాటు సీఎస్కే విల్లాస్‌లోకి తీసుకెళ్లాడు.దీంతో భాషా తన స్నేహితులను కారులో ఉండమని చెప్పి తన వద్ద నున్న రూ.9 లక్షలను తీసుకుని గుర్తు తెలియని వ్యక్తితో విల్లాస్‌లోకి వెళ్లాడు. సదరు వ్యక్తి గురుస్వామికి ఫోన్ చేస్తానని చెప్పాడు. వెంటనే నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి అక్కడకి వచ్చి రెండు డబ్బు సంచులను లాక్కొని రెండు బైక్‌లపై పారిపోయారు. దీంతో షాక్‌కు గురైన భాషా కాసేపటికి వారు ఎవరని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న భాషా పోలీసులను ఆశ్రయించాడు.
రూ.9 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు


