మొయినాబాద్‌రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం సుజాత ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఫీజులు పెంచిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బ్యాగరి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు, యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని అధికారులను కోరుతామని హెచ్చరించారు. విద్యాధికారి పాఠశాలను సందర్శించి ఫీజులను పరిశీలించి వారికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం ముందుకు వచ్చి పదిరోజుల్లో తల్లిదండ్రులతో కలిసి సమావేశమవుదామని చెప్పడంతో ధర్నా విరమించారు.
పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధర్నా


