ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ వహించి, ఫిర్యాదులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి సోమవారం ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన 33 ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించారు.
భూ సేకరణపై ఫిర్యాదు
యాచారం: ఫార్మాసిటీ, ఫ్యూచర్‌సిటీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం పేరుతో వ్యవసాయ భూములను లాక్కుంటున్నారని కుర్మిద్ద గ్రామ గిరిజన రైతులు సోమవారం నేషనల్ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కుర్మిద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని మంగలిగడ్డ, మర్లకుంట తండాలకు చెందిన గిరిజన రైతులు మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షుడు రఘురామ్ రాథోడ్ ఆధ్వర్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్ బానోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
కాలనీ రహదారుల కబ్జా
హైడ్రా ప్రజావాణిలో 58 ఫిర్యాదులు
సాక్షి, సిటీబ్యూరో : కాలనీల్లో రహదారులను కబ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాలనీ రోడ్డుంటే.. ఇరువైపులా ప్లాట్లున్న వారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్తగా పక్కన లే ఔట్‌లు వేసిన వారు.. ఇప్పటికే ఉన్న వరద, మురుగు కాలువలకు ఆటంకాలు సష్టిస్తున్నారు. కుంట్లూరు సర్వే నం. 204లో దాదాపు 15 ఎకరాల మేర 800 ప్లాట్లతో అంజానాద్రినగర్ పేరిట లే ఔట్ వేశారు. పక్కనే లే ఔట్ వేసిన వారు తమ లే ఔట్లోకి జరిగి రహదారితో పాటు కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజనాద్రి ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ నాగార్జున సాగర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మన్నెగూడ విలేజ్‌లో రహదారిని ఆక్రమించారని.. రోడ్డు మీద ట్రాన్స్‌ఫార్మర్, గుడికి చెందిన ప్రహరీ నిర్మించారని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ కూడా వచ్చిందని.. అందులో రోడ్డు కూడా ఉందని.. ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాలని అక్కడివారు చెబుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. సాహేబ్‌నగర్‌లో మహలక్ష్మీనగర్ కాలనీ పక్కన కమర్షియల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వరద కాలువను మూసేయడంతో తమ ప్రాంతం నీట మునుగుతోందని ఫిర్యాదు చేశారు. నాచారం – మల్లాపూర్ ప్రధాన రహదారిలో ఆక్రమణలు జరుగుతున్నాయని.. రోడ్డు మీదకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని మైలార్‌దేవుపల్లిలోని టీఎన్‌జీవో కాలనీలో 1200ల గజాల పార్కును కబ్జా చేశారని ఫిర్యాదులందాయి. ఇదే కాలనీలో 40 ఫీట్ల రహదారిని కూడా కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుద్వేల్ పత్తికుంటకు వెళ్లే వరద కాలువను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులందగా.. వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను అధికారులకు అప్పగించారు.


