షాద్‌నగర్‌రూరల్: బండరాయితో మోది మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడకు చెందిన శోభ (33) కొన్నేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజును కులాంతర వివాహం చేసుకుంది. వారికి బాబు మహేందర్ ఉన్నాడు. కొంత కాలం తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అనంతరం నాలుగేళ్ల క్రితం శోభ మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటకు చెందిన నర్సింలును రెండో వివాహం చేసుకుంది. వారికి పాప మమత ఉంది. కొంత కాలం సాఫీగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో శోభ ఆరు నెలల క్రితం కూతురిని తీసుకొని పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. తిరిగి తన వద్దకు రావాలని భర్త పలుమార్లు కోరినా శోభ వినిపించుకోలేదు. ఈ క్రమంలో శోభ ఇతరులతో చనువుగా ఉంటోందని, ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని నర్సింలు అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న కొడుకు మహేందర్‌కు సైకిల్ ఇప్పిస్తా, పాపను తీసుకొని మహబూబ్‌నగర్‌కు రావాలని శోభకు ఫోన్ చేశాడు. మహబూబ్‌నగర్‌కు వచ్చిన వారిని తీసుకొని మార్గమధ్యలో మద్యం కొనుగోలుచేసి తన గదికి తీసుకెళ్లాడు. గది బయట వరండాలో భార్యభర్తలు మద్యం తాగే సమయంలో మరోసారి గొడవ జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నర్సింలు భార్య తలపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం ఎవరికీ తెలియకుండా అర్థరాత్రి వరకు భార్య మృతదేహాన్ని గదిలో దాచిపెట్టాడు. తరువాత శవాన్ని మూటకట్టి బైక్ ట్యాంక్‌పై పెట్టుకొని, కూతురును కూర్చోపెట్టుకొని రంగారెడ్డిగూడ సమీపంలోని వ్వయసాయ పొలంలో పడేసి వెళ్లాడు విచారణ ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నర్సింలు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన గ్రానైట్‌రాయి, ధరించిన చొక్కాను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించడంలో కీలకంగా వ్యహరించిన పట్టణ సీఐ సీతారాం, ఎస్‌ఐ సుశీల, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
భార్యను హత్య చేసిన భర్త
కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ
నిందితుడికి రిమాండ్


