వక్ఫ్‌ భూముల నోటిఫికేషన్‌పై చర్చ | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూముల నోటిఫికేషన్‌పై చర్చ

Mar 24 2026 8:46 AM | Updated on Mar 24 2026 8:46 AM

చేవెళ్ల: ఆలూరులో ఇండస్ట్రియల్‌ పార్కుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తహసీల్దార్‌ కృష్ణయ్య అన్నారు. చేవెళ్ల తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ఆలూరు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఆలూరులోని 1,248 ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూములకు సంబంధించిన నోటిఫికేషన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇక్కడి భూముల్లో రాబోయే కంపెనీలతో ఈ ప్రాంత అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న వక్ఫ్‌ బోర్డు భూములు ఎప్పటికీ రైతులకు పట్టా కాదని, ఇవి వక్ఫ్‌, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైనా తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తించాలన్నారు. సాగు చేసుకుంటున్న రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి, పరిహారం తదితర విషయాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, భూములు తీసుకుంటే తమ జీవనం కష్టమవుతుందని తెలిపారు. భూమికి బదులు భూమి ఇచ్చే విధంగా చూస్తే మేలు జరుగుతుందన్నారు. న్యాయం జరిగేలా కృషి చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. గ్రామసభలు పెట్టి రైతుల అభిప్రాయలు సేకరించి పరిహారం గురించి తెలియజేస్తామని చెప్పారు. అందరూ ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కౌలంపేట శేఖర్‌, యాదిరెడ్డి, కసిరే వెంకటేశ్‌, తోట చంద్రశేఖర్‌, బర్ల బుచ్చయ్య, బాబర్‌, రాంచంద్రయ్య, రాములు, అనంతరాములు, కృష్ణ, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement