వీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

వీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి

Mar 24 2026 8:46 AM | Updated on Mar 24 2026 8:46 AM

షాద్‌నగర్‌రూరల్‌: దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన విప్లవవీరుల ఆశయ సాధనకు యువత ముందుకు సాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భగత్‌సింగ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ 95వ వర్థంతిని పురస్కరించుకొని చేపట్టిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్‌ ఆమంచినాగేశ్వర్‌ హాజరై భగత్‌సింగ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రంకోసం ఎందరో వీరులు అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సమాజంలో సమానత్వం, శోషణరహిత వ్యవస్థకోసం పోరాడిన గొప్ప విప్లవకారులని కొనియాడారు. భగత్‌సింగ్‌ తన రచనలు, ప్రసంగాలతో సామాజిక అసమానతలు, కుల వివక్ష, ఆర్థిక దోపిడీపై తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. భగత్‌సింగ్‌ కలలు కన్న సమాజ నిర్మాణంకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని రక్షించుకోవడానికి విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఈనగంటి వెంకటేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్‌, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, ప్రజా సంఘాల నాయకులు కుర్మయ్య, వెంకటరమణ, రాజు, నర్సింలు, జనార్దన్‌, శ్రీనునాయక్‌, ఈశ్వర్‌నాయక్‌, శ్రీకాంత్‌, పవన్‌చౌహాన్‌, ఆకాష్‌నాయక్‌, లక్ష్మణ్‌కుమార్‌, చంద్రమౌళి, లక్ష్మి, మహ్మద్‌బాబు, రాజు, చరణ్‌, బబ్లూ, అజయ్‌రెడ్డి, యశ్వంత్‌, ఆదిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement