బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
ఆమనగల్లు: బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి కార్యాలయ జీసీడీఓ సునీత అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు పది రోజులుగా నిర్వహిస్తున్న వాయిస్ ఫర్ హర్ వాయిస్–దిశ శిబిరం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన సునీత మాట్లాడుతూ.. విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి, వారి భవిష్యత్తు దిశకు శిబిరం ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో వసతిగృహ అధికారి గోపాల్, ప్రిన్సిపాల్ విమల, వాయిస్ ఫర్ సంస్థ సభ్యులు అనన్య, సాత్విక, శృతి తదితరులు పాల్గొన్నారు.
వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు
తుర్కయంజాల్: యువత వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ ఈగల్ డీఎస్పీ సైదులు అన్నారు. తొర్రూర్ డివిజన్ పరిధిలోని ఇంజాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మరో జన్మ రిహాబిలిటేషన్ అండ్ డీ అడిక్షన్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మత్తులో యువత చిత్తవుతోందని అన్నారు. 90 రోజుల కౌన్సెలింగ్‌లో మెరు గైన వైద్యంతో పాటు, నిపుణులతో కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి వ్యసనంగా మార్చుకున్న వారు సమాజం నుంచి అనేక చీత్కరింపులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌ఐ సైదులు, నిర్వాహకులు సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ పేరుతో
ఆగం చేయొద్దు
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకి రూ.కోటి నష్ట పరిహారం అందించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనుల కోసం మంగళవారం మండల పరిధిలోని ఏక్వాయిపల్లి సమీపంలోని పొలాల్లో జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులు పర్యటించారు. సమాచారం అందుకున్న గ్రామ రైతులు అక్కడికి చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో తమ బతుకులు ఆగమవుతాయని, కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, లేని పక్షంలోఎకరాకి రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు.
బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి


