‘ఫ్యూచర్’లోకి ఆ ఠాణాలు
చేవెళ్ల: డివిజన్‌లోని ఐదు పోలీస్‌స్టేషన్‌లు కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోకి మారాయి. డివిజన్‌లో ఒక డీసీపీ, రెండు ఏసీపీ, ఆరు పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తు తం చేవెళ్ల ఏసీపీ ఒకటి ఉండగా కొత్తగా మొయినాబాద్ ఏసీపీ స్థానం ఏర్పాటైంది. ఈ రెండు ఏసీపీల పరిధితో డీసీపీ స్థానం మొయినాబాద్ పేరుతో ఏర్పడింది. చేవెళ్ల, మోకిల, శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్లు చేవెళ్ల ఏసీపీ పరిధిలోకి.. మొయినాబాద్, షాబాద్, శంషాబాద్‌లోని పెద్దషాపూర్ మొయినాబాద్ ఏసీపీ పరిధిలోకి రానున్నాయి. కాగా, కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి రానున్న మూడు కొత్త డీసీపీలు ఆయా నియోజకవర్గాల పేరుతో ఏర్పాటవుతుండగా చేవెళ్ల డీసీపీ మాత్రం మొయినాబాద్ పేరుతో రావటంపై అన్ని పార్టీల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల పేరు లేకపోవడంపై చర్చించుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కమిషనరేట్‌ను, డీసీపీలు, ఏసీపీల పరిధిని స్వాగతిస్తున్నట్టు అధికార పార్టీ నాయకులు తెలిపారు. అదే క్రమంలో చేవెళ్ల పేరుపై మాత్రం ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లి పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రిని కలిసి చర్చించేలా.. చేవెళ్ల డీసీపీగా కొనసాగించేలా చూస్తామని చెబుతున్నారు.


