పల్లె పోరులో అద్వితీయ విజయాలు | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరులో అద్వితీయ విజయాలు

Dec 19 2025 10:14 AM | Updated on Dec 19 2025 10:14 AM

పల్లె పోరులో అద్వితీయ విజయాలు

పల్లె పోరులో అద్వితీయ విజయాలు

భర్త కారోబార్‌.. భార్య సర్పంచ్‌

యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలువురి సర్పంచుల విజయం చర్చనీయాంశంగా మారింది. యాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మస్కు అనిత గెలుపొందారు. ఆమె భర్త శివశరణం ప్రస్తుతం గ్రామ పంచాయతీలో కారోబార్‌గా విధులు నిర్వర్తిసున్నారు. అనిత కాంగ్రెస్‌ మద్దతుతో మాజీ ఎంపీపీ కొప్పు సుకన్యను 300 ఓట్ల తేడాతో ఓడించారు.

మాజీ ఎంపీటీసీల భర్తల గెలుపు

యాచారం: మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి ఎంపీటీసీగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన కొర్ర జ్యోతినాయక్‌ భర్త కొర్ర అరవింద్‌ నాయక్‌(కాంగ్రెస్‌) ఆ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడైన యాదయ్యగౌడ్‌ను 200లకు పైగా ఓట్లతో ఓడించారు. యాదయ్యగౌడ్‌ ప్రస్తుతం యాచారం పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మల్కీజ్‌గూడ గ్రామ ఎంపీటీసీగా సేవలందించిన డేరంగుల శారద ఆమె శంకర్‌ ప్రస్తుతం సర్పంచ్‌గా గెలుపొందారు.

ఒక పర్యాయం ఎంపీటీసీ

కందుకూరు: సర్పంచ్‌గా ఎన్నికై న సరికొండ పాండు 2019 నుంచి ఐదేళ్ల పాటు ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఎంపీటీసీ అనంతరం సర్పంచ్‌గా గెలుపొందడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ కారోబారే సర్పంచ్‌

యాచారం: మండల పరిధిలోని నస్దిక్‌సింగారం గ్రామ పంచాయతీలో కారోబార్‌గా విధులు నిర్వర్తించిన బోడ కృష్ణ సర్పంచ్‌గా గెలుపొందారు. తన ప్రత్యర్థి చింతుల్ల చిత్తారి(కాంగ్రెస్‌) మీద వందకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. కారోబార్‌గా పనిచేస్తూ సమస్యలను గుర్తించానని, సర్పంచ్‌గా గెలుపొందడంతో బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తానని కృష్ణ పేర్కొన్నారు.

నాడు తండ్రి.. నేడు కొడుకు

యాచారం: మండల పరిధిలోని చింతపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గతంలో తోట్ల మల్లయ్య బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమేశ్‌ ఆ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. తక్కళ్లపల్లి తండా గ్రామ సర్పంచ్‌గా రమావత్‌ జగదీష్‌ సర్పంచ్‌గా పనిచేయగా ప్రస్తుతం ఆయన తల్లి కౌసల్య సర్పంచ్‌గా విజయం సాధించారు. గడ్డమల్లయ్యగూడ గ్రామంలో గతంలో అచ్చెన జంగయ్య ఆ గ్రామానికి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఆయన భార్య మంగ సర్పంచ్‌గా గెలుపొందారు.

నాడు ఎంపీపీ.. నేడు సర్పంచ్‌

కందుకూరు: మండల పరిధిలోని గుమ్మడవెల్లికి చెందిన పల్స మహేశ్‌గౌడ్‌ 1995–2001 వరకు ఉప సర్పంచ్‌గా, 2001–2006 మధ్య ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించారు. ప్రజా మద్దతుతో ఈ విజయాలు సాధ్యం అయ్యాయని పేర్కొన్నారు.

మూడోతరం నేత

యాచారం: మండల పరిధిలోని తమ్మలోనిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా దెంది రాంరెడ్డి(కాంగ్రెస్‌) 489 ఓట్లతో గెలు పొందారు. వారి ఇంట్లో మూడో తరం సర్పంచ్‌గా పేరుగాంచారు. చింతపట్ల గ్రామ పంచాయతీ కింద తమ్మలోనిగూడెం అనుబంధ గ్రామంగా ఉండేది. ఆ గ్రామానికి 1959 మొదటి సారి జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో దెంది రాంనాథ్‌రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. తర్వాత రాంనాథ్‌రెడ్డి కుమారుడు పర్వత్‌రెడ్డి సర్పంచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం రాంరెడ్డి మూడోతరం సర్పంచ్‌గా గెలుపొందారు.

అప్పుడు భర్త ఇప్పుడు భార్య

కందుకూరు: మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో 2019–2024 జనవరి వరకు కాసుల రామకృష్ణారెడ్డి సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా ఆయన భార్య కాసుల స్వాతి విజయం సాధించారు. దీంతో భార్య, భర్త ఇద్దరు సర్పంచ్‌లుగా గెలిచినట్లయింది.

గతంలో ఎంపీటీసీగా..

కందుకూరు: మండల పరిధిలోని చిప్పలపల్లికి చెందిన సురమోని లలిత 2019 నుంచి ఐదేళ్ల పాటు ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement