బడా నేతలకు ఝలక్!
యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నేతలను ఖంగు తినేలా చేశాయి. పార్టీలోనే కీలక పదవులు.. కానీ సొంత గ్రామాల్లో మాత్రం ప్రజల నుంచి వారికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం పార్టీలో కీలక పదవుల్లో కొనసాగుతున్న నేతల స్వగ్రామాల్లో వారు పోటీలో నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. రూ.లక్షలాధి ఖర్చు చేసి, కాళ్లకు గజ్జలు కట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా తమ మద్దతుదారులను గెలిపించుకోకపోవడం గమనార్హం. ఏళ్లుగా రాజకీయాల్లో అరితెరిన నాయకులు ఓటమిపాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. మద్దతు దారుల ఓటమిని తెలుసుకున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు తమ పార్టీ నేతల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది.
యాచారంలో ఉల్టా.. పల్టా!
మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజర్ గ్రామాలైన యాచారంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న కొప్పు బాషా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తన భార్య కొప్పు సుకన్య(మాజీ ఎంపీపీ)ను పోటీలో నిలబెడితే ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంగోత్ వెంకటేష్ తక్కళ్లపల్లి తండాలో తన భార్య విజయను బరిలో పెడితే ఓడిపోయారు. గునుగల్‌లో పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి సర్పంచ్‌గా పోటి చేసి ఓటమి పాలయ్యారు. మంతన్‌గౌరెల్లిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ తన మద్దతుదారుడైన పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్యగౌడ్‌ను సర్పంచ్‌గా పోటీలో నిలబెడితే పరాజయం చెందారు. నక్కర్తమేడిపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తన భార్య లావణ్యను సర్పంచ్ బరిలో నిలబెడితే ఓటమి చెందారు. నందివనపర్తిలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డిలు కాంగ్రెస్ నుంచి పేరుమల్ల రవిని పోటిలో నిలబెడితే పరాజయం చెందారు. ఆయా పార్టీల్లో కీలక నేతలున్న గ్రామాల్లో వారి మద్దతుదారులు ఓటమిపాలు కావడంతో మండలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఊర్లల్లో బోల్తాపడిన ఉద్దండులు
పంచాయతీ ఎన్నికల్లో పలువురికి భంగపాటు
ఊహించని ఓటమితో అంతర్మథనం
రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వైనం


