ముగ్గురు పిల్లలతో గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దారపల్లి యాదయ్య తన భార్య వరలక్ష్మి(32), కుమారులు రాంప్రసాద్(12), సాయి(10), కుమార్తె అఖిల(8)లతో కలిసి ఏడాది క్రితం తుక్కుగూడకు జీవనోపాధి నిమిత్తం వలస వచ్చారు. యాదయ్య పార పని చేస్తుండగా, వరలక్ష్మి హోటల్‌లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన యాదయ్య ఇంట్లో ఉండగా, భార్య హోటల్‌కు వెళ్లింది. పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తల్లి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారు. ఎంతకి ఇంటికి రాకపోవడంతో వారి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై యాదయ్య పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.


