నా విగ్రహావిష్కరణ నేడే!
● బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం
● విభిన్న కార్యక్రమంతో అందరినీ ఆకర్షిస్తున్న ‘అమెరికా ఆదర్శ రైతు’
● తన వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
మొయినాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యవసాయం చేసి, ఆదేశంలో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్న ఓ వ్యక్తి వినూత్న కార్యక్రమంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.. ఆయనే కళ్లెం నర్సింహారెడ్డి. తాను బతికి ఉండగానే తనతో పాటు తన భార్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని కందికల్‌గేట్‌కు చెందిన కళ్లెం రాజిరెడ్డి, పెంటమ్మ దంపతులకు 1937లో నర్సింహారెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. పుట్టింది రంగారెడ్డి జిల్లా కోహెడలో అయినా.. పెరిగింది అంతా చాంద్రాయణగుట్ట సమీపంలోని కందికల్‌గేట్‌లోనే. శాలిబండ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచే వ్యవసాయంపై మక్కువ. నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరంతా అమెరికాలో స్థిరపడటంతో 1975లో ఆయన కూడా అమెరికా వెళ్లారు. అక్కడ ఐదువేల ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 30 ఏళ్ల పాటు వ్యవసాయం చేశారు. రకరకాల పంటలు పండించి ఆదర్శరైతుగా నిలిచారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.
మాతృభూమిపై మమకారం..
మాతృభూమిపై ఉన్న మమకారంతో 2005లో నర్సింహారెడ్డి తెలంగాణకు వచ్చారు. నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో మూడున్నర ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు పంటలు సాగుచేస్తూనే మరోవైపు పలు సాంస్కృతిక సంఘాలకు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు.
నీతోడుగా నేనుంటా..
గత ఏడాది డిసెంబర్‌లోనే తన వ్యవసాయ క్షేత్రంలో నర్సింహారెడ్డి తన భార్యతో కలిసి ఆయన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. కానీ ఈ విగ్రహం బాగోలేదని భావించారు. ఇటీవల తన భార్య మరణించడంతో రాజస్థాన్ వెళ్లి తనతో పాటు భార్య విగ్రహాన్ని తయారు చేయించి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారు. శుక్రవారం బంధువులు, స్నేహితుల మధ్య వీటిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తన భార్యకు తానెప్పుడూ తోడుగా ఉంటానని, అందుకే ఆమె పక్కనే, తన విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయించానని చెబుతున్నారు. అందరూ రావాలని బంధువులు, సన్నిహితులను ఆహ్వానించారు.


