ఉల్లి.. అమాంతం పైకెళ్లి
రెండు రోజుల్లోనే రెండురెట్లు పెరిగిన ధర నిన్నటి వరకు కిలో రూ.20 లోపే.. తాజాగా హోల్‌సేల్‌లో కేజీ రూ.35 రిటైల్ మార్కెట్‌లోరూ.40కి చేరిన రేటు అదే దారిలో కోడుగుడ్డుసైతం పెరుగుదల బెంబేలెత్తుతున్నవినియోగదారులు
హుడాకాంప్లెక్స్: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 లోపే ఉండగా తాజాగా హోల్‌సేల్ మార్కెట్లో రూ.35 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి కూరలోనూ ఉల్లిని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. తాజాగా వీటి ధరలు పెరగడంతో నెలకు రెండు మూడు కిలోలు కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం కేజీ లోపుతోనే సరిపెట్టుకుంటున్నారు.
అమాంతం పెరిగిన ధరలు
సరిహద్దులోని బంగ్లాదేశ్ నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్ర, సహా తెలు గు రాష్ట్రాల్లో పండించిన పంటను పశ్చిమ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తు తం పంట దిగుబడి కూడా లేదు. గోదాముల్లో నిల్వ చేసిన కొద్ది పాటి పంటను కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. దీంతో గ్రేటర్ జిల్లాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌కు రోజుకు సగటున 25 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది.నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ. 1,500 నుంచి రూ.1,800 వరకు పలికింది. ఇక్కడికి రావాల్సిన ఉల్లి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండటంతో ధర అమాంతం పెరిగింది. గడ్డ సైజు ను బట్టి క్వింటాల్‌కు రూ.3,500 పలుకుతోంది.
కొండెక్కిన కోడు గుడ్డు
సాధారణంగా చలికాలంలో గుడ్డును ఎక్కువగా తీసుకుంటుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆమ్లెట్, ఉడికించిన గుడ్డును అందిస్తుంటారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన గుడ్లను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గుడ్డుపై 65 పైసలు ఎక్కువ వస్తుండటంతో రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ హోల్‌సేల్ గుడ్డు ధర రూ.6.66 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8 పలుకుతోంది. ఒకవైపు ఉల్లి.. మరోవైపు కోడిగుడ్డు ధరలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ధరలు చూస్తే దడ
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఉల్లి, కోడిగుడ్డు కాంబినేషన్ పెరిగింది. మాంసాహారాల్లోనే కాదు శాఖాహారాల్లోనూ ఉల్లి తప్పనిసరైంది. రోజు కు కనీసం ఒకటి రెండు గడ్డలు అవసరం. నెలకు మూడు నుంచి నాలుగు కిలోలు కొనే దాన్ని. ప్రస్తుత ధరలతో సగానికి తగ్గించాను. ఇక కోడిగుడ్డు రోజుకు బదులు.. వారానికి ఒకటి రెండుసార్లే కొనుగోలు చేస్తున్నాం.
– కృష్ణవేణి, గృహిణి


