యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Dec 16 2025 7:03 AM | Updated on Dec 16 2025 7:03 AM

యువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య

గోల్కొండ: తమ్ముడితో తగాదపడుతున్న వారిని వారించబోయిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి టోలిచౌకీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రమేష్‌ తెలిపిన మేరకు.. హకీంపేట్‌ విరాట్‌నగర్‌ కుంటకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌(24) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ పోషణ కోసం ఇతను కాలేజీ నుంచి వచ్చిన తరువాత ఆటో నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో తన తమ్ముడు అద్నాన్‌నుపై పారమౌంట్‌ కాలనీ గేట్‌ నెంబర్‌ 4 వద్ద కొందరు యువకులు దాడి చేస్తునట్లు తెలిసింది.వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి వారిని వారించాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్‌పై బిలాల్‌ తన స్నేహితులతో దాడి చేశాడు. బిలాల్‌ తన వద్ద ఉన్న కత్తితో ఇర్ఫాన్‌ను చాతి, మెడ కింది భాగం, కడుపులో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయాడు. ఇర్ఫాన్‌ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఇర్ఫాన్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన షేక్‌ ఉమర్‌ ఫరూక్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అతని స్నేహతుడు షేక్‌ సుల్తాన్‌ బాషాతో కలిసి బైక్‌ మీద హౌసింగ్‌ బోర్డు నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళుతున్నారు. లులు మాల్‌ ఫ్లై ఓవర్‌ వద్ద ముందు వెళుతున్న హోండా కారు ఒక్కసారిగా రోడ్డుపై ఆగడంతో వెనుక ఉన్న మరో డిజైర్‌ కారు కూడా ఆగి నెమ్మదిగా వెళుతోంది. ఈ క్రమంల బైక్‌ అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా షేక్‌ ఉమర్‌ ఫరూక్‌ మృతి చెందగా షేక్‌ సుల్తాన్‌ భాషా విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఫరూక్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు రోజులు..126 కెమెరాలు..

నిందితులను పట్టించిన నిఘా నేత్రం

బంజారాహిల్స్‌: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ ఖరీదైన నగలు, నగదు ఉన్న బ్యాగ్‌ను దారి మధ్యలో పోగొట్టుకోగా, బంజారాహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు ఆరు రోజులు కష్టపడి 126 కెమెరాలను వడబోసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–11లో నివసించే స్వాతి అగర్వాల్‌ (41) ఈ–కామర్స్‌లో వస్త్ర వ్యాపారం చేస్తోంది. ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల వేళ ఆమె బ్యాంక్‌లో డబ్బులు జమ చేయడానికి బైక్‌పై వెళ్తూ తన హ్యాండ్‌బ్యాగ్‌ను కాళ్ల వద్ద ఉంచుకుంది. రోడ్డునెంబర్‌–12లో బ్యాగ్‌ కింద పడిపోగా, ఆమె గమనించలేదు. అదే సమయంలో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు కారులో వెళ్తుండగా బ్యాగ్‌ కనిపించింది. డ్రైవర్‌ కారు ఆపి ఆ బ్యాగ్‌ను తీసుకుని వైద్యురాలికి ఇచ్చాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు కొద్దిదూరం ఆమెను అనుసరించి బైక్‌ అడ్డంగా నిలిపి కారును ఆపారు. బాధితురాలు మినిస్టర్‌ క్వార్టర్స్‌ సమీపంలో ఏడుస్తూ కూర్చొన్నదని, ఆమెకు ఇస్తామని చెప్పి వైద్యురాలి దగ్గరున్న బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించారు. అదే రోజు రాత్రి బాధితురాలు స్వాతి అగర్వాల్‌ తాను బ్యాగ్‌ పోగొట్టుకున్నానని, అందులో డైమండ్‌ పెండెంట్‌, బంగారు గాజులు, చెవి రింగులు, మూడు సెల్‌ఫోన్లు, 15 ఏటీఎం కార్డులు, ఇతర ధ్రువపత్రాలు ఉన్నాయని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి దారిలోని సీసీ కెమెరాలు వడబోస్తూ జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–36లో ఆ యువకుల బైక్‌ నెంబర్‌ను గుర్తించారు. బైక్‌ నెంబర్‌ ఆధారంగా ఫోన్‌ నెంబర్‌ను సేకరించి బోరబండలో నిందితులు సయ్యద్‌ పర్హాన్‌ (27), మహ్మద్‌ మోసిన్‌ (26)ను పట్టుకుని బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement