షూటింగ్ బాల్ విజేత వరంగల్
తాండూరు టౌన్: రాష్ట్ర స్థాయి అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్ బై ఇన్‌స్పైరింగ్ ఉమెన్ త్రో యాక్షన్) ఖేలో ఇండియా షూటింగ్ బాల్ విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈనెల 13, 14వ తేదీల్లో తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాల మైదానంలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం జట్లు నిలిచాయి. విజేతలకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఐలయ్య ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహద పడతాయన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఆణిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం టోర్నీ నిర్వహణ కార్యదర్శి ఎం.రాములు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులు జనవరి చివరి వారంలో ఉత్తరాఖండ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మార్క్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి, పీడీ గౌరీశంకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, సీహెచ్ రాములు, ఆంజనేయులు, రాము, రవీందర్ రెడ్డి, శరణ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. రాములు తదితరులు పాల్గొన్నారు.
ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం


