రూ.10 కోట్ల మద్యం పంచేశారు!
శంకర్‌పల్లి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో లక్షలాది రూపాయల సరుకు తీసుకెళ్తున్నా.. ఎక్కడికి, ఎందుకు వెళ్తుందోనని కూడా చూడటం లేదు. ఎవరైనా ఈవిషయాన్ని అడిగినా అదేం లేదు.. అని చెబుతుండటం గమనార్హం. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే రూ.10 కోట్ల వరకు మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
నిత్యం పార్టీలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నియ మావళి ప్రకారం అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ప్రలోభ పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
అర్ధరాత్రి అనుకున్న చోటికి..
శంకర్‌పల్లి మండల పరిధిలో మొత్తం పది మద్యం దుకాణాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువుగా ఉన్న షాపుల యజమానులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థి తరఫు వారు కాకుండా, షాపులకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అర్ధరాత్రి వేళ అనుకున్న చోటికి తరలించారు. ఇవన్నీ గమనిస్తున్న పోలీసులు దుకాణదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం.
తనిఖీలు, కేసులు అంతంతే..
మండలంలో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అవి తూతూమంత్రంగానే పని చేశాయి. పలు గ్రామాల్లో మద్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ.. పోలీసులు మాకేంటి అన్న విధంగా వ్యవహరించారని అభ్యర్థుల మద్దతుదారులు వాపోయారు. మరికొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున మద్యం పట్టుబడితే, పరిచయం ఉన్న నాయకులు ఫోన్లు చేయడంతో కొంత మేర పట్టుకున్న కేసులు నమోదు చేసి మమ అనిపించారు.
‘ఫ్రెండ్లీ’గా వ్యవహరించిన పోలీసులు
నేతల ఒత్తిళ్లకు లొంగి..
నామమాత్రపు తనిఖీలతో సరి


