సంగ్రామం షురూ! | - | Sakshi
Sakshi News home page

సంగ్రామం షురూ!

Nov 27 2025 11:25 AM | Updated on Nov 27 2025 11:25 AM

సంగ్రామం షురూ!

సంగ్రామం షురూ!

నామినేషన్‌ నిబంధనలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గురువారం 10.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక రిటర్నింగ్‌ కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సహా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను నియమించారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ డివిజన్ల పరిధిలోని 174 గ్రామ పంచాయతీలు.. 1,530 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆయా స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు ఉవ్విల్లూరుతున్నారు. పార్టీ గుర్తుతో సంబంధం లేకపోయినప్పటికీ.. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీ పడుతున్నారు. నామినేషన్ల సందర్భంగా ఆయా అభ్యర్థులు తమ మద్దుతుదారులతో ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆయా రిటర్నింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

కోడ్‌ అమలు: కలెక్టర్‌ నారాయణరెడ్డి

గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులను ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను పాటించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలను తొలగించాలని ఆదేశించారు.

అలసత్వానికి అవకాశం ఇవ్వొద్దు

ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అవసరమైన సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులను నిర్వహించామని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సరి చూసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గడువులోపే పరిష్కరించాలి

తాగునీరు, టాయిలెట్స్‌, ఫర్నిచర్‌, విద్యుత్‌, లైటింగ్‌ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. రిజర్వేషన్ల జాబితాను మరోమారు పరిశీలించుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. అందుకు అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన అంశాలపై, నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను గడువు లోపు పరిష్కరించాలని చెప్పారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌ మోహన్‌, నోడల్‌ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

● నామినేషన్‌ వేసే వ్యక్తి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

● అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్‌ ఉదయం 10.30గంటల నుంచి 5 గంటల లోపు సమర్పించాలి.

● ప్రతిపాదకుడు సంబంధిత వార్డు ఓటర్‌ లిస్టులో నమోదై ఉండాలి. అభ్యర్థి గ్రామ ఓటరుగా నమోదై ఉండాలి.

● అభ్యర్థి, ప్రతిపాదకుడు ఇంటి పన్ను చెల్లించి గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి.

● డిపాజిట్‌ రుసుము సర్పంచ్‌ అభ్యర్థికి రూ.2 వేలు, వార్డుసభ్యుడికి రూ.500, రిజర్వుడు కేటగిరి సర్పంచి అభ్యర్థి రూ.వేయి, వార్డు అభ్యర్థికి రూ.250

● ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.. లేదంటే నామినేషన్‌ ఫాంలోని పార్ట్‌–3లో డిప్యూటీ తహసీల్దార్‌తో సంతకం చేయించాలి.

● ఇద్దరు సాక్ష్యుల స్వీయ ధ్రువీకరణ పత్రంలో అన్ని గడులు పూరించి ఇవ్వాలి.

● రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్‌ పై సంతకం చేసి ఇవ్వాలి.

● అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫొటో సమర్పించాలి.

● స్క్రుట్నీ రోజు నిర్ణీత సమయానికి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎదుట హాజరవాలి.

● నామినేషన్‌ దాఖలు చేసేవారు ఎన్నికల ఖర్చు లెక్క కోసం ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంది.

తొలిదశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఏడు మండలాలు.. 174 జీపీలు 1,530 వార్డులకు ఎన్నికలు

రెండు మూడు జీపీలకు ఒక రిటర్నింగ్‌ ఆఫీసు ఏర్పాటు

తొలి విడత ఎన్నికలు నిర్వహించే పంచాయతీలు

మండలం జీపీలు వార్డులు

కొత్తూరు 12 110

నందిగామ 19 170

కేశంపేట 29 260

కొందుర్గు 22 186

చౌదరిగూడ 24 204

ఫరూఖ్‌నగర్‌ 47 410

శంషాబాద్‌ 21 190

తొలి విడత వివరాలు

మొత్తం సర్పంచ్‌ స్థానాలు 174

వార్డులు, పోలింగ్‌ బూత్‌లు 1,530

నామినేషన్ల స్వీకరణ 27 నుంచి 29వ తేదీ వరకు

స్క్రుట్నీ, అభ్యర్థుల గుర్తింపు నవంబర్‌ 30

అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్‌ 1

నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్‌ 3

తుది అభ్యర్థుల జాబితా డిసెంబర్‌ 3

పోలింగ్‌, ఫలితాల ప్రకటన డిసెంబర్‌ 11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement