తరిగేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

తరిగేస్తున్నారు!

Nov 27 2025 11:25 AM | Updated on Nov 27 2025 11:25 AM

తరిగే

తరిగేస్తున్నారు!

రోజంతా పడిగాపులే కొర్రీలతో ఇబ్బంది పెట్టొద్దు తనిఖీలు చేయిస్తా

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.. 24 గంటల్లో ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కేంద్రం నిర్వాహకులు పెట్టే కొర్రీలకు ఇబ్బందులు పడలేక దళారులను ఆశ్రయిస్తున్నారు.

యాచారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం లేక వెలవెలబోతున్నాయి. ప్రారంభించి పక్షం రోజులైనా అంతంత మాత్రం ధాన్యమే వస్తోంది. వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1,40,238 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్‌ తదితర మండలాల్లో వరి పంటను అత్యధికంగా సాగు చేశారు.

34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఆయా మండలాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగుతోంది. ఏ–గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.2,369గా ధర నిర్ణయించారు. సన్నాలకు రూ.500 బోనస్‌ అదనం. కానీ ఆశించిన స్థాయిలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదు. నేటికీ జిల్లా వ్యాప్తంగా కేవలం 50 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు చేరింది. మిల్లర్లు తేమ శాతంతో సంబంధం లేకుండానే క్వింటాల్‌కు రూ.2,500కు పైగా చెల్లిస్తుండడంతో రైతులకు వారికే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఐకేపీ, డీసీఎంఎస్‌ సిబ్బంది లారీలతో పొలాల వద్దకే వెళ్లి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నందివనపర్తి కొనుగోలు కేంద్రానికి మంగళవారం ధాన్యం తీసుకెళ్లా. రోజంతా పడిగాపులున్నాం. ప్రైవేటు వ్యాపారులు పొలాలవద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాలకు తీసుకువచ్చి ఇబ్బంది పడుతున్నాం.

– బౌరమ్మ, మహిళా రైతు, కుర్మిద్ద

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులను ఇబ్బంది పెట్టొద్దు. తూకం, తరుగు, హమాలీ ల మోసంతో ధాన్యం తెచ్చేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దళారులకు, మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. – అంజయ్య యాదవ్‌,

కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదనే సమాచారం ఉంది. మండల వ్యవసాయాధికారులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని ఆదేశించాం. మోసం చేస్తున్నట్లు తేలితే తగు చర్యలు తీసుకుంటాం.

– ఉష, జిల్లా వ్యవసాయాధికారి

ఐకేపీ సెంటర్లలో తూకం, తరుగు, హమాలీ పేరిట కోత

కొర్రీలు పెట్టడంతో ధాన్యం తెచ్చేందుకు రైతుల అనాసక్తి

అధికశాతం మిల్లర్లకు, దళారులకే విక్రయం

పక్షం రోజులు గడుస్తున్నా 50 వేల క్వింటాళ్ల వరి ధాన్యమే సేకరణ

పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు మెండిగౌరెల్లికి చెందిన మేకల యాదగిరిరెడ్డి 93 బస్తాల ధాన్యాన్ని యాచారం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. కేంద్రం నిర్వాహకులు ఒక్కో బస్తాలో 43 కిలోల ధాన్యం నింపి మూడు కిలోల చొప్పున తరుగు తీశారు. బస్తాల్లో ధాన్యం నింపినందుకుగాను హమాలీలు క్వింటాల్‌కు రూ.50 చొప్పున 37 క్వింటాళ్ల ధాన్యానికి రూ.2 వేలు వసూలు చేశారని చెప్పాడు. తరుగు, తూకం, హమాలీ పేరుతో ఇలా దోపిడీ చేస్తే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా ఫలితం లేదని వాపోయాడు.

తరిగేస్తున్నారు!1
1/1

తరిగేస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement