జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర

Nov 27 2025 11:25 AM | Updated on Nov 27 2025 11:25 AM

జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర

జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని విలువైన భూములు, జిల్లా ఆదాయంపై కాంగ్రెస్‌ సర్కార్‌ కన్నేసిందని.. జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు నడుం బిగించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో బుధవారం దీక్షా దివస్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను, మేడ్చల్‌ జిల్లా మొత్తాన్ని ఏకపక్షంగా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్‌ నిర్ణయించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. ఆర్థికంగా పరిపుష్టమై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివారు ప్రాంతాలకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారిందన్నారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికంగా పెను భారం తప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం, నల్లా కనెక్షన్‌, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్లు ఇలా ప్రతీ పనికి హైదరాబాద్‌ వైపు చూడాల్సి వస్తుందని చెప్పారు. నగర అభివృద్ధిని మూలన పడేసిన రేవంత్‌ సర్కార్‌ శివారు ప్రాంతాలను సైతం అధోగతిపాలు చేయడానికే ఈ విలీన ప్రక్రియ చేపట్టారని తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయం మీద మక్కువ ఉన్న కేసీఆర్‌ సాగుకు ఊతమిస్తే.. రియల్‌ ఎస్టేట్‌ మీద మక్కువతో రేవంత్‌ రెడ్డి భూముల అమ్మకం మీద దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా ప్రజలంతా ఏకమై జిల్లాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

దీక్షాదివస్‌కు తరలిరండి

పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29న ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించే దీక్షాదివస్‌ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్‌ పాలనలో జిల్లా నంబర్‌ వన్‌గా ఎదిగితే రేవంత్‌ సర్కార్‌ హోల్‌సేల్‌గా అమ్మేందుకు దిగిందని మండిపడ్డారు. షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చీరలు పంచుతోందని, బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండగలకు రెండు సార్లు ఎగ్గొటిందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి క్యామ మల్లేష్‌ మాట్లాడుతూ.. జిల్లా అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, రైతు బంధు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, నాయకులు దేశమోల్ల ఆంజనేయులు, దండెం రాంరెడ్డి, నరేందర్‌, వేణుగోపాల్‌ రెడ్డి, బూర్కుంట సతీశ్‌, మోహన్‌ రావు, కృపేశ్‌, యాదగిరి, సురేందర్‌ రెడ్డి, దీపా మల్లేశ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

దీక్షాదివస్‌ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement