ఎకరాకు రూ.కోటి ఇస్తే.. ఓకే
● లేదంటే భూ సేకరణ అడ్డుకుంటాం
● భూనిర్వాసితుల గ్రామసభలో మర్రిపల్లి రైతులు
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కొల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని.. లేదంటే భూమికి భూమి పరిహారంగా అందించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. రావిర్యాల–ఆకుతోటపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మర్రిపల్లి గ్రామంలో భూసేకరణ, నష్ట పరిహారం, పునరావాసం, పునరుపాధి కల్పనకు భూ నిర్వాసితులతో బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చంద్రారెడ్డి, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ జయశ్రీ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నష్టపరిహారానికి సంబంధించి గ్రామాల మధ్య పోలిక తగదు అన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో భవిష్యత్‌లో అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. మర్రిపల్లిలో నిర్వాసితులకు రూ.30లక్షల పరిహారం, లేదంటే రూ.25 లక్షలతో పాటు, ఒక ప్లాట్ అందిస్తుందని చెప్పారు.
పరిహారంతో ప్లాట్‌కూడా రాదు
భూ నిర్వాసితులు మాట్లాడుతూ నష్టపరిహారం చెల్లించకుండా భూ సేకరణ చేపట్టడం ఎలా చేపడతారని ప్రశ్నించారు. మార్కెట్ ధర రూ.కోటిన్నర ఉండగా ఇరవై, ముప్పై లక్షల రూపాయలు కట్టించి తమ భూములు లాక్కోవడం తగదన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తమ గ్రామంలో ఒక ఇంటి స్థలం కూడా కొనలేమన్నారు. న్యాయమైన పరిహారం ఇస్తే భూములిస్తామని లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నారాయణ, జంగయ్య, శ్రీరాములు, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


