కారును ఢీకొన్న డీసీఎం
ముగ్గురికి గాయాలు
చేవెళ్ల: కారును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో.. ముగ్గురు త్రీవంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి ఊరేళ్లకు చెందిన బండ్ల శేఖర్.. తన స్విప్ట్ కారులో తల్లి చంద్రమ్మ, చెల్లెలు స్వప్న తో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చేవెళ్ల నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్తున్న డీసీఎం.. దేవునిఎర్రవల్లి గేట్ వద్ద కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు వెనకకు వెళ్లి గేట్ వద్ద ఉన్న కమాన్ పిల్లర్‌ను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను చేవెళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శేఖర్ ఫిర్యాదుతోకేసు నమోదు చేసి, ఫిర్యాదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తప్పిన ప్రమాదం
బొంరాస్‌పేట: మండల పరిధి రేగడిమైలారం జాతీయ రహదారి 163పై హైదరాబాద్‌నుంచి కర్నాటక వైపు వెళ్తున్న ఓ లారీ బుధవారం ప్రమాదానికి గురైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా.. రోడ్డు పక్కకు జారి లోయలో పడే క్రమంలో.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రహదారికి అడ్డంగా తిరిగి ఆగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
చోరీ కేసులో బాలుడుజువైనల్‌కు తరలింపు..
దోమ: చోరీ కేసులో ఓ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాస్‌పల్లి గ్రామానికి చెందిన మైనర్(17).. ఈ నెల 24న గ్రామంలోని మంత్రి శ్రీశైలం ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తాళాలు పగుళగొట్టి, రూ.1.80 లక్షలు అపహరించాడు. ఇంట్లో సామగ్రిచిందరవందరగా ఉండటాన్ని గమనించిన బాధితులు.. నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో.. అతడి నుంచి రూ.98 వేలు రికవరీ చేశారు. అనంతరం బుధవారం జువైనల్ హోంకు తరలించారు. నిందితుడు గతంలో పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.


