పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రాచకొండ సీపీ సుధీర్‌బాబు
హుడాకాంప్లెక్స్: విధుల్లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2వేల మంది విద్యార్థులు, కాలనీవాసులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారోత్సవాలకు సుద్దాల అశోక్‌తేజ, సీపీ సుధీర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు సేవలందించి అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకునేందుకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవవలు అందించడంలో రాచకొండ పోలీసుల సేవలు అభినందనీయమని అన్నారు. కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు నిమిషానికి రెండు ఫోన్ కాల్స్ వస్తుంటాయని, ఏకకాలంలో పనిచేసి ప్రజలకు ఆరు విభాగాలుగా ఏర్పడి విజబుల్ పోలీసింగ్‌లో భాగంగా సేవలు అందిస్తూ ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండే సీనియర్ సిటిజన్స్‌కు వారి ఇంటింటికి వెళ్లి సహాయ సహకారం అందిస్తున్నామని, ఆపరేషన్ స్మైలీతో ప్రజలకు దగ్గర కావడం, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. దేశంలో ఎన్‌బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్‌గా రాచకొండ కమిషనరేట్ నిలిచిందని సీపీ గుర్తుచేశారు. కార్యక్రమంలో డీసీపీలు పద్మజ, అనురాధ, ఆకాంక్షయాదవ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్‌బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషారాణి, సునీతారెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసులు, నాగలక్ష్మి, మనోహర్, శ్యాంసుందర్, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.


