ఏసీబీ వలలో లైన్ ఇన్‌స్పెక్టర్
● రూ.6 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన విద్యుత్ శాఖ అధికారి
● గతంలో జైలుకెళ్లినా మారనితీరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ శాఖ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రెండోసారి ఏసీబీకి చిక్కాడు. ప్రస్తుతం సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఓ ఇంటి మీటర్‌కు డబ్బులు డిమాండ్ చేసి, రూ.6 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధి తట్టిఅన్నారంలో ఇల్లు నిర్మించుకున్న ఓ వ్యక్తి కరెంటు మీటర్ కోసం దరఖాస్తు చేసుకోగా లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభులాల్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మధ్యాహ్నం తట్టిఅన్నారంలోని తాజా టిఫిన్ సెంటర్ వద్ద బాధితుడి నుంచి రూ.6 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఇదే సర్కిల్‌లో పదేళ్ల క్రితం లైన్‌మన్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి జైలుకెళ్లాడు. అయినా బుద్ధి మారలేదు. రూ.2 లక్షలకు పైగా జీతం వస్తున్నా అడ్డదారులు తొక్కడం ఆపలేదని సమాచారం. ఈక్రమంలో సదరు అధికారి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064ను లేదా 9440446106లకు సమాచారం ఇవ్వాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు సూచించారు.


